
ప్రత్యేక హోదా అర్హత ఏపీకి లేదు
► కేంద్రం నుంచి చంద్రబాబు బయటకొస్తే ప్రజలకే నష్టం
► కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశ సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, అడవులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, బాగా వెనుకబడిన ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా అర్హత ఉందని చెప్పారు. ఈ నాలుగింటిలో ఆంధ్రప్రదేశ్ దేంట్లోనూ లేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూలోటు అధికంగా ఉండి రాష్ట్రం వెనుకబడటంతో ప్రత్యేక హోదా కావాలని మొదట్లో అడిగినట్లు తెలిపారు. ’ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం-ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై అవగాహన’ పేరుతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో ఏపీలో ఏర్పడే రూ. 22 వేల కోట్ల రెవెన్యూలోటును కేంద్రం అందజేస్తుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 2 లక్షల 6 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు. ఆర్థిక సంఘం కేటారుుంపుల్లో ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. పోలవరం పూర్తిచేసే బాధ్యతను కేంద్రం చిత్తశుద్ధితో చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రాన్ని సాయం అడగడానికి బాబు భయపడుతున్నారనడంలో అర్థం లేదన్నారు. కొందరు కేంద్రం నుంచి బయటకు వచ్చేయమని చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారని, దానివల్ల అటు మోదీకి, ఇటు బాబుకి ఎటువంటి నష్టం లేదన్నారు. దానివల్ల నష్టం ప్రజలకేనని వ్యాఖ్యానించారు.
భారీ వర్షంతో అస్తవ్యస్తం..
సభ ప్రారంభమైన అరగంట అనంతరం కుండపోతగా వర్షం కురవడంతో అంతా అస్తవ్యస్తంగా మారింది. వానలోనే వెంకయ్య ప్రసంగం కొనసాగించగా సభాస్థలి నుంచి జనం వెళ్లిపోయారు.