అధిగమించారు
Published Thu, Jan 2 2014 11:10 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ..అడుగడుగా పరీక్షలు ఎదుర్కొంటూనే వస్తోంది. అన్ని అవరోధాలను తమదైన శైలితో అధిగమిస్తూ వచ్చిన ఆప్ నాయకులు అత్యంత కీలకమైన విశ్వాస పరీక్షలోనూ ‘37’ మార్కులతో పాస్ అయ్యారు. గురువారం నాటి విశ్వాసపరీక్ష ఫలితం ఊహించినదే అయినా ఢిల్లీ అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఢిల్లీవాసులు ఆసక్తి కనబర్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాలు ప్రారంభయ్యాయి. దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశాల విశేషాలను ఉత్కంఠగా గమనించారు. మధ్యాహ్నం 4.10 గంటల నుంచి 4.40 గంటల వరకు టీ బ్రేక్ ఇచ్చారు. అనంతరం సమావేశాలు కొనసాగాయి.
ఆప్ సర్కార్‌లో కేబినెట్ మంత్రి మనీశ్ సిసోడియా విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయా పార్టీల సభ్యులు సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రొటెం స్పీకర్ మతీన్ అహ్మద్ సభలో ఒక్కోపార్టీ సభ్యుడికి అవకాశం ఇస్తూ సభను నడిపించారు. కాంగ్రెస్ మద్దతుతో ఆప్ సర్కార్ ఏర్పాటు చేయడంపై బీజేపీ సభ్యులు విమర్శల వర్షం కురిపించారు. ఆప్ సర్కార్‌కి తాము మద్దతు ఇవ్వబోమంటూ బీజేపీ శాసనసభ పక్షనాయకుడు డా.హర్షవర్ధన్ ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామంటూ, కాంగ్రెస్‌పార్టీపై పోటీకి దిగిన ఆప్ అధికారం కోసం వారితో చేతులు కలిపిందంటూ దుయ్యబట్టారు. బీజేపీ సభ్యులు తమతమ ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్, ఆప్ సభ్యులు అడ్డుతగలడంతో కొన్నిమార్లు అసెంబ్లీ వేడెక్కింది. మధ్య మధ్యలో కొందరు సభ్యులు తమ వాక్‌చాతుర్యంతో సభలో నవ్వులు పూయించారు.
ఆమ్‌ఆద్మీఅని చెప్పుకుంటున్న పార్టీ ఎమ్మెల్యేల్లో 17 మంది వరకు కోటీశ్వరులేనని బీజేపీ సభ్యులు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ..ప్రజల సంక్షేమం కోసమే ఆమ్‌ఆద్మీపార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉందని, ఆప్ ఇచ్చిన ఉచిత మంచినీటి హామీతో వారికి ఎలాంటి లబ్ధి ఉండదని, అలాంటి వారి గురించి ఆలోచించాలంటూ కొందరు కాంగ్రెస్ సభ్యులు సూచించారు. ఆయా పార్టీల సభ్యులు ప్రసంగిస్తున్నంత సేవు వారి పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. జేడీయూ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ప్రసంగిస్తుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇక్బాల్ కాసేపు హంగామా సృష్టించారు. తన కోటు విప్పడంతోపాటు ముందుకు వెళ్లబోయారు. మిగిలిన ఎమ్మెల్యేలు కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆప్ సర్కార్ విశ్వాస పరీక్షను చూసేందుకు ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సందడి వాతావరణం కనిపించింది.
దేవుడి దయ... మన ప్రాప్తి: సీఎం కేజ్రీవాల్
దేవుడి దీవెనలు ఉన్నంత వరకు మన ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఆశీస్సులు లేకపోతే ఎంతభద్రత ఉన్న వీఐపీని రక్షించలేదని తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల భద్రత పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం సబబు కాదన్నారు. ప్రజా సొమ్ముతో ప్రత్యేక సౌకర్యాలు అనుభవిస్తూనే, సామాన్యుల జీవనానికి ఆటంకం కలిగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసు భద్రత లేకుండానే సొంత కారులో కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నానని, అన్ని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్‌లైట్ పడితే ఆగానని, దీనివల్ల తన సమయం వృథా అయిందని భావించడం లేదని ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి మాట్లాడారు.
Advertisement
Advertisement