హెల్ప్‌కు ‘లైన్’!
హెల్ప్‌కు ‘లైన్’!
Published Thu, Jan 9 2014 11:28 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
సాక్షి, న్యూఢిల్లీ:అవినీతిపై ఢిల్లీవాసుల పోరు మొదలైంది. కొన్నేళ్లుగా అవినీతి అధికారుల అక్రమాలతో విసిగివేసారి పోయి ఉన్న సామాన్యులు తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మొదటి ఏడుగంటల్లోనే హెల్ప్‌లైన్‌కు సుమారు 3,900 ఫిర్యాదులు అందాయంటే నగరంలో అవినీతి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మూడోదైన అవినీతి నిరోధానికి తీసుకున్న ఈ చర్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పిల్లల చదువులు, పింఛన్లు, విద్యుత్ తదితర శాఖల పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఢిల్లీవాసులకు ఈ ‘హెల్ప్‌లైన్’ ఒక అస్త్రంగా ఉపయోగపడనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ హెల్ప్‌లైన్ ప్రభావపూరితంగా పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు. ఢిల్లీవాసులు ప్రతిఒక్కరూ అవినీతి నిరోధక ఇన్‌స్పెక్టర్లుగా మారిపోతున్నారని ఆయన అభినందించారు. మొదటి రోజున మొదటి ఏడు గంటల్లో 3900 కాల్స్ వచ్చాయని, ఫోన్‌చేసిన 800 మందితో మాట్లాడిన సలహాదారులు వాటిలో 53 కాల్స్ తీవ్రమైన ఫిర్యాదులని గుర్తించారని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఈ 53 మందిలో 38 మంది మాత్రమే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడానికి అంగీకరించారని, 15 మంది నిరాకరించారని ఆయన చెప్పారు.
స్టింగ్ నిర్వహించడానికి అంగీకరించినవారిలో కొందరు ఇప్పటికే స్టింగ్ నిర్వహించి అవినీతి నిరోధక విభాగానికి ఆడియో టేపులను అప్పగించారని కేజ్రీవాల్ తెలిపారు. ఈ స్టింగ్ ఆపరేషన్ల నాణ్యత కూడా అద్భుతంగా ఉన్నట్లు అధికారులు తనకు చెప్పారని ఆయన వివరించారు. తమకు టేపులందిన కేసులపై అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు. లంచగొండులు.. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఢిల్లీవాసులకు సులభంగా గుర్తుండేందుకు నాలుగంకెల హెల్ప్‌లైన్ నంబర్‌ను శుక్రవారం సాయంత్రం వరకు ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ హెల్ప్‌లైన్‌లో 30 లైన్లు ఉంటాయి. అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను కేజ్రీవాల్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్.దిలీప్‌కుమార్‌ను అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌కు సలహాదారుగా నియమించారు.
దిలీప్‌కుమార్ గతంలో అవినీతి నిరోధక విభాగాధిపతిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ సంస్థల అవినీతిని బట్టబయలుచేయడంకోసం 50కి పైగా స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. అవినీతిపరులైన అధికారులను గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు తమను లంచమడిగిన అధికారిమాటలను రికార్డు చేసుకుని సాక్ష్యంగా తేవాలని ఆయన అప్పట్లోనే చెప్పేవారని తెలుస్తోంది. నర్సరీ అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రుల కోసం డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్ ప్రకటించింది. అడ్మిషన్ ప్రక్రియ గురించి తల్లిదండ్రులడిగే ప్రశ్నలకు ఈ హెల్ప్‌లైన్ సమాధానమిస్తుంది. ఫిర్యాదు చేయదలచినవారు పిర్యాదులను నమోదుచేయవచ్చు. ఈ ఫిర్యాదులను సంబంధిత విద్యాధికారులకు పంపుతారు. 011-27352525 నంబరు కలిగిన ఈ హెల్ప్‌లైన్ జనవరి 13 నుంచి పనిచేయవచ్చని విద్యా విభాగం తెలిపింది. కాల్‌సెంటర్ ఆపరేటర్లు ఈ హెల్ప్‌లైన్ నడుపుతారు. ప్రస్తుతం ఈ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు.
Advertisement
Advertisement