ప్రతి శనివారం జనతాదర్బార్ నిర్వహిస్తా: సీఎం
Published Thu, Jan 9 2014 11:10 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ వ్యవస్థ వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శనివారం జనతాదర్బార్‌తో ఈ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి ఫిర్యాదులను స్వీకరించడం కోసం ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రతి శనివారం ఉదయం సచివాలయం ఎదుటనున్న రోడ్డుపై జనతా దర్బార్ నిర్వహిస్తారని, మిగతా రోజుల్లో జరిగే జనతా దర్బార్‌కు ఎవరైనా ఒక మంత్రి హాజరై అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ప్రజలనుంచి అందే ఫిర్యాదులను ఐదు కేటగిరీలుగా విభజించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
మొదటి కేటగిరీలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అంటే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరించాలనేది మంత్రి సంబంధిత ఫైలుపై రాస్తారు. విధాన మార్పులు అవసరమైన ఫిర్యాదులను రెండవ కేటగిరీలో చేరుస్తారు. వీటిని సంబంధిత మంత్రులకు, ముఖ్యమంత్రికి పంపి ప్రభుత్వ విధానాలలో అవసరమైన మార్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. సమస్యల పరిష్కారానికి ప్రజలందించే సలహాలను మూడవ కేటగిరీలో చేరుస్తారు. ఈ సలహాలను అధ్యయనం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి హేతుబద్ధమైన సలహాలను అమల్లోకి తేవడానికి ప్రయత్నిస్తారు. నాలుగవ కేటగిరీలో ఇతర ఫిర్యాదులను, ఐదవ కేటగిరీలో ప్రభుత్వానికి సంబంధించని ఫిర్యాదులను చేరుస్తారు. అధికారులు పరిష్కరించినట్లుగా పేర్కొని మూసివేసిన కేసుల పర్యవేక్షణకు కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని కేజ్రీవాల్ చెప్పారు.
ఫిర్యాదుదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపి అధికారులు చేపట్టిన చర్యలు వారికి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటామని, తమ కార్యకర్తలు తదనంతరం ఫోన్లు చేస్తారని ఆయన చెప్పారు. ఈ వ్యవస్థను ప్రారంభించిన వెంటనే ఫిర్యాదులు వెల్లువెత్తే అవకాశం ఉన్నందువల్ల ఇది వెనువెంటనే నూటికి నూరు శాతం ప్రభావపూరితంగా పనిచేస్తుందని ఆశించరాదని కేజ్రీవాల్ ముందుగానే హెచ్చరించారు. కాలక్రమేణా ఈ వ్యవస్థ ప్రభావపూరితంగా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం కిందకు రాని డీడీఏ, ఎమ్సీడీ, ఢిల్లీ పోలీసు విభాగాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆ విభాగాలే చూసుకుంటాయని ఆయన చెప్పారు.
ప్రేమ పెళ్లిళ్లు చేయించలేను..
తాను ప్రేమ పెళ్లిళ్లు జరిపించలేనని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం నెలకొల్పనున్న వ్యవస్థ గురించి విలేకరులకు వివరిస్తున్న సమయంలో సీఎం ఇలా వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల తన వద్దకు ఒక యువతి వచ్చి తాను ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరిందన్నారు. ఆ యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని.. అతడితో తన వివాహం అయ్యేలా చూడాలని ఆమె కోరినట్లు సీఎం వివరించారు. పరిష్కరించాలని ఉన్నా, సీఎం అయినప్పటికీ తాను ఇలాంటి సమస్యలను పరిష్కరించలేనని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement