కపిల్ మిశ్రా స్టుపిడ్: సునీత కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రాపై ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. మిశ్రా ‘స్టుపిడ్’ అని సంభోదించిన ఆమె... తన మరది ఇక లేరంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సునీత కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ తన కళ్లముందు మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారంటూ కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ బంధువుల భూవివాదాన్ని రూ. 50 కోట్లకు సెటిల్ చేసినట్లు సత్యేంద్రజైన్ వ్యక్తిగతంగా తనకు చెప్పారంటూ కపిల్ మిశ్రా బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ స్పందిస్తూ ‘కపిల్ కు తలకాయ లేదు. ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించారన్న అక్కసుతోనే మిశ్రా అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. సుప్టిడ్ మెన్’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
My brother in law is no more n this stupid man is speaking all written script without any mind.
— Sunita Kejriwal (@KejriwalSunita) 8 May 2017
కాగా కేజ్రీవాల్ సొంత బావమరిది సురేంద్ర కుమార్ బన్సల్ నకిలీ బిల్లులు, ఇన్వాయిస్‌లు సమర్పించి ప్రజాపనుల శాఖ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సురేంద్ర కుమార్ షుగర్ లెవల్స్ పెరగడంతో గుర్గావ్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.