stupid
-
మిస్టర్ ప్రెసిడెంట్
‘మనిషి తిట్టినందుకు దేశాన్నే నాశనం చేసే దేవుడు.. మనిషవుతాడు కానీ, దేవుడౌతాడా’ అన్నాడు డ్యుటర్టే. దేవుణ్ని అతడు ‘స్టుపిడ్’ అని ఇప్పటికి వారం రోజులు అవుతోంది. ఇంతవరకు అతడు దేవుడికి గానీ, దేశానికి గానీ క్షమాపణ చెప్పలేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ‘స్టుపిడ్’ అనే మాట కామన్ అయిపోయింది. కామన్ అవడం అంటే తిట్టుస్థాయి నుంచి అధ్యక్షస్థాయికి చేరుకోవడం. ట్రంప్ రాకడకు ముందే ఈ లోకానికో ట్రంప్ ఉన్నాడు. ఉన్నా, తగిన పోలిక లేక అతడు పైకి తేల్లేదు. పేరు రోడ్రిగో డ్యుటర్టే. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు. పదవిలో, వయసులో ట్రంప్ కన్నా ఏడాది పెద్ద. ట్రంప్ రాకడకు ముందే ఈ లోకంలో స్టుపిడ్ అనే మాట కూడా ఉంది. ఉండడానికి ఉంది కానీ, ట్రంప్, డ్యుటర్టే వచ్చాకే బాగా యూసేజ్‌లోకి వచ్చింది. స్టుపిడ్ అని ఎక్కడైనా వినబడితే అదిప్పుడు పౌరుల్ని పౌరులు తిట్టుకున్నదై ఉండకపోయే అవకాశాలే ఎక్కువ. ఇద్దరు దేశాధ్యక్షులు కనిపిస్తారు ఆ మాట వినిపించిన వైపు! డ్యుటర్టేతో పోలిస్తే ట్రంప్ నథింగ్. కానీ ట్రంప్ వచ్చాకే డ్యుటర్టే సమ్‌థింగ్ అయ్యాడు. ‘ఆసియా ట్రంప్’ అయ్యాడు. నిజానికి ట్రంప్‌ని అనాలి ‘అమెరికన్ డ్యుటర్టే’ అని. అంత పెద్ద నోరు డ్యుటర్టేది. ఒబామాను అతడు ‘సన్నాఫ్ ఎ వోర్’ అన్నాడు. పోప్ ఫ్రాన్సిస్నీ అదేమాట అన్నాడు! ఫిలిప్పీన్స్‌లోని యు.ఎస్.రాయబారిని ‘ఫాగెట్’ అన్నాడు. హోమో సెక్సువల్ అని! యు.ఎన్. జనరల్ సెక్రెటరీ బన్ కి–మూన్‌ని ‘సన్నాఫె బిచ్’ అన్నాడు. డ్యుటర్టే ఎంత పెద్దవాళ్లనైనా లెక్క చెయ్యడు. తనే పెద్ద అని కూడా అనుకోడు. ‘నా ముఖం నచ్చలేదా, పేల్చెయ్ నన్ను’ అని గన్ తీసి చేతికిస్తాడు. అవతలివాడి ముఖం నచ్చలేదా.. నచ్చలేదని చెప్పడు, గార్డ్ని పిలిచి ‘పేల్చేయ్ వాడిని’ అని గార్డ్ చేతిలో గన్ పెడతాడు. మరీ నచ్చకపోతే తనే గన్ తీసుకుంటాడు. లోపల ఎన్ని బులెట్లు ఉన్నాయని కూడా చూసుకోడు. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ కాక ముందు, చాలా ఏళ్ల క్రితం దావో సిటీ మేయర్‌గా ఉన్నప్పుడు ముగ్గురు గన్మెన్లను కాల్చి చంపేశాడు డ్యుటర్టే. ‘‘ముగ్గురున్నారు కాబట్టి ముగ్గుర్నీ కాల్చేశాను. వాళ్ల బాడీలోకి ఎన్ని బులెట్లు దిగాయో మాత్రం నేను చెప్పలేను’’ అని ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాడు డ్యుటర్టే. ‘చట్టం ఉంది కదా’ అంటే, ‘చేతిలో గన్ లేకపోతే కదా’ అంటాడు. పైగా మేయర్. ఇంటికొచ్చిన అమ్మాయిల్ని ఇంట్లో అమ్మాయిల్లా రెప్పల్లో పెట్టుకోలేకపోతే నేనెందుకు ఉండేడ్చినట్లు అంటాడు. ఒక చైనా అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసినందుకు ఆ గన్మెన్లకు అతడు ఇన్‌స్టంట్‌గా విధించిన శిక్ష అది. ఇంకా చాలా కిల్లింగ్స్ ఉన్నాయి అతడి అకౌంట్లో. అధ్యక్షుడు అయ్యాక ‘వార్ ఆన్ డ్రగ్స్’ మొదలు పెట్టి ఇరవైవేల మందిని షూట్ చేయించాడు. మానవ హక్కులవాళ్లొచ్చారు. ‘ఎవరి హక్కుల గురించి మాట్లాడ్డానికొచ్చారు? క్రిమినల్స్ హక్కుల గురించేనా?! పొండవతలికి’ అని గన్ తీశాడు. మనిషి సాదాసీదాగా ఉంటాడు. కిందొక ప్యాంటు, పైనొక చొక్కా. ముఖం మీద నవ్వుండదు. ఉన్నట్లనిపిస్తుంది. మాటలో ఆచడం తూచడం ఏం ఉండదు. ‘వెళ్లిన చోట మీరేం చేసినా అది నామీద వేసుకుంటాను.. సరేనా? మీరు ముగ్గుర్ని రేప్ చేసినా మీ తరఫున నేను జైలుకెళతాను. కానీ నలుగుర్ని పెళ్లిచేసుకొస్తే మాత్రం ఊరుకోను’ అని పెద్దగా నవ్వి, సైనికుల్లో స్పిరిట్ నింపినవాడు డ్యుటర్టే. డ్యూటీ చేసినా జోక్‌గానే చెయ్యాలి. కానీ అది సీరియస్‌గా ఉండాలి అంటాడు! ఈమధ్య దేవుణ్ని కూడా అతడు జోక్‌గానే సీరియస్‌గా తిట్టాడు.. ‘స్టుపిడ్’ అని! దేవుడిలో డ్యుటర్టే్టకి కనిపించిన స్టుపిడిటీ.. ఆడమ్ అండ్ ఈవ్లను తనే సృష్టించి, వాళ్లు పాపపు ఆపిల్ తిని తప్పుచేశారని మళ్లీ తనే వాళ్లను శిక్షించడం. డ్యుటర్టే దేవుణ్ణి తిట్టినందుకు క్యాథలిక్ కంట్రీ హర్ట్ అయింది. ఫిలిప్పీన్స్‌లో తొంభై శాతం మంది క్రిస్టియన్లే. వాళ్లలో ఎక్కువమంది క్యాథలిక్కులే. ‘ఇతడేం ప్రెసిడెంటండీ! ప్రజల మత విశ్వాసాలను పట్టించుకోడా? అని అడిగారు బిషప్పులు. ‘డ్యుటర్టే క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే ఫిలిప్పీన్స్ సర్వనాశనం అయిపోతుంది’ అని హెచ్చరించారు మతపెద్దలు. ‘ఒక మనిషి తనని తిట్టినందుకు దేశాన్నే నాశనం చేసే దేవుడు.. మనిషవుతాడు కానీ, దేవుడౌతాడా’ అన్నాడు డ్యుటర్టే. దేవుణ్ని అతడు ‘స్టుపిడ్’ అని ఇప్పటికి వారం రోజులు అవుతోంది. ఇంతవరకు అతడు దేవుడికి గానీ, దేశానికి గానీ క్షమాపణ చెప్పలేదు. డ్యుటర్టేకి ఏమిటింత ధైర్యం?! అది ధైర్యం కాకపోవచ్చు. దేవుడంటే అతడికి ఉండే నమ్మకం కావచ్చు. కోపం వస్తే నోరు పారేసుకోడానికి, గన్ తీసి పేల్చడానికి దేవుడేం ‘డ్యుటర్టే’ కాదని తెలియనంత స్టుపిడేం కాకపోవచ్చు అతడు. - మాధవ్ శింగరాజు -
అమిత్‌షా ఓ అజ్ఞాని: సీఎం సిద్ధ రామయ్య
సాక్షి, బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలివి లేదని, ఆయన ఒక అజ్ఞాని అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. సిద్ధ రామయ్య అంటే అవినీతి.. అవినీతి అంటే సిద్ధ రామయ్య అని మైసూరులో అమిత్‌షా గురువారం చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం తన ట్విటర్లో విరుచుకుపడ్డారు. దోషి అయిన అమిత్‌షా మరో దోషి అయిన యడ్యూరప్పను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై, తన ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను అమిత్‌షా నిరూపించగలరా అని సవాల్ విసిరారు. కేవలం అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలని ఆయన చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రజలు అమిత్‌షా అబద్ధాలను నమ్మరన్నారు. -
కపిల్ మిశ్రా స్టుపిడ్: సునీత కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రాపై ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. మిశ్రా ‘స్టుపిడ్’ అని సంభోదించిన ఆమె... తన మరది ఇక లేరంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సునీత కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ తన కళ్లముందు మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారంటూ కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ బంధువుల భూవివాదాన్ని రూ. 50 కోట్లకు సెటిల్ చేసినట్లు సత్యేంద్రజైన్ వ్యక్తిగతంగా తనకు చెప్పారంటూ కపిల్ మిశ్రా బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ స్పందిస్తూ ‘కపిల్ కు తలకాయ లేదు. ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించారన్న అక్కసుతోనే మిశ్రా అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. సుప్టిడ్ మెన్’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. My brother in law is no more n this stupid man is speaking all written script without any mind. — Sunita Kejriwal (@KejriwalSunita) 8 May 2017 కాగా కేజ్రీవాల్ సొంత బావమరిది సురేంద్ర కుమార్ బన్సల్ నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు సమర్పించి ప్రజాపనుల శాఖ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సురేంద్ర కుమార్ షుగర్ లెవల్స్ పెరగడంతో గుర్గావ్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. -
మెక్సికన్ మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌పై మెక్సికన్ మాజీ అధ్యక్షుడు ఫెలిపె కాల్డెరోన్ విరుచుకు పడ్డారు. ట్రంప్ ప్రచార ప్రణాళికపై స్పందించిన కాల్దెరోన్.. తీవ్ర పదజాలంతో విమర్శించారు. సరిహద్దు గోడ నిర్మాణాకి ఒక్క సెంట్ కూడా చెల్లించేది లేదని.. అదో స్టుపిడ్ వాల్ అని అన్నారు. బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం యాంఛెన్ వెళ్ళిన కాల్దెరోన్.. ఆ వాల్ నిర్మాణ ప్రయత్నం ఎందుకూ పనికి రానిదన్నారు. అంతేకాక అధ్యక్ష పదవికి ట్రంప్ సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పోటీపై కాల్డెరోన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఓ ప్రశంసనీయ సమాజం ఉన్న ఆమెరికాలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేస్‌లో ట్రంప్ వంటి అభ్యర్థులు పోటీ పడటం నమ్మలేకపోతున్నామంటూ తన అయిష్టాన్ని వెళ్ళగక్కారు. ట్రంప్ బాగా చదువుకున్న మనిషే అయినా అధ్యక్ష పదవికి తగ్గ తెలివితేటలు లేవన్నారు. కాగా తన ప్రచారంలో ట్రంప్... సరిహద్దు సమస్యలు, ఇమ్మిగ్రేషన్లను ప్రధాన అజెండాలుగా చేసుకున్నారని, మెక్సికో ...రేపిస్టులను, క్రిమినల్స్‌ను బరిలోకి పంపిస్తోందంటూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అంతేకాకుండా ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రచార సాధనంగా ఎంచుకోవడాన్ని కాల్డెరోన్ తప్పుబట్టారు. ప్రజల, వాణిజ్య శ్రేయస్సును కోరుకునేవారు సరిహద్దును మూసివేయడంపై మాట్లాడటం వారి ఓటమికి ప్రధమ కారణం అవుతుందన్న కాల్దెరోన్... అటువంటి విధానాలను ప్రవేశపెట్టడం అమెరికా శ్రేయస్సుకు ఎంతమాత్రం సరికాదన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అసంబద్ధమని, మెక్సికో నుంచి అక్రమ వలసలు సమస్యలను తెచ్చి పెడతాయని అన్నారు. గత నవంబరులో చేపట్టిన ఓ నివేదిక ప్రకారం మెక్సికోకు ఇమ్మిగ్రేట్ అయ్యేవారికంటే ఆమెరికా నుంచి వలసలు ఎక్కువయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాల్దెరోన్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. -
నా దేశభక్తిని ప్రశ్నించేవాళ్లు స్టుపిడ్స్!
ముంబై: తాను లౌకిక వాదినని (సెక్యులర్) రుజువు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. దేశంలో అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదమైన నేపథ్యంలో షారుఖ్ ఈ విధంగా స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అసహనం' చర్చ గురించి ప్రశ్నించగా 'దీని గురించి నిజంగా నాకేమీ తెలియదు. నేను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్తాను. మంచి విషయాలు మాట్లాడుతాను. అంతేకాకుండా నేను సెక్యులర్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తాను' అని ఆయన బదులిచ్చారు. 'మన ముందుకుసాగాలంటే లింగ వివక్ష, వర్ణవివక్ష, ఓ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ మతం వాడు, ఏ కులం వాడు వంటి అంశాలను మన మనస్సులో పెట్టుకోకూడదు. అలాంటి విషయాలకు అంతే ఉండదు' అని షారుఖ్ చెప్పాడు. కాబట్టి తాను సినిమాలు, నటన గురించి మాట్లాడాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు. 'నీకంటే నేను ఎక్కువ దేశభక్తుడిని అని ఎవరైనా చెబితే.. అతను మూర్ఖుడు (స్టుపిడ్). ఏ కోణంలో ఒకరు తనకు తాను అధిక దేశభక్తుడినని అనుకోగలరు? దీనిలో ఎలాంటి హేతుబద్ధత లేదు. నీ కంటే నేనే ఎక్కువ దేశభక్తుడినంటూ మనం కేకలు పెడుతున్నాం. నిజానికి మనమందరం దేశభక్తులమే' అని చెప్పాడు. దేశంలోని పరిస్థితులపై గత ఇంటర్వ్యూలో తాను మనసులోని అభిప్రాయాలు వెల్లడించానని, వాటిని నెగిటివ్ దృష్టితో తీసుకున్నారని షారుఖ్ చెప్పారు. దాంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై షారుఖ్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు.