రాజకీయంగా కేజ్రీవాల్ రాంగ్‌రూట్
Published Thu, Dec 5 2013 11:36 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: తన మాజీ సహచరుడు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. 2011లో ఇండియా అగెనైస్ట్ కరప్షన్ పేరిట ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి రాజకీయ రూపం ఇవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించడంతో అన్నా హజారే ఆయన నుంచి వైదొలిగారు. తామిద్దరం కలిసి ఉంటే నేడు పరిస్థితి మరో విధంగా ఉండేదని హజారే అభిప్రాయపడ్డారు. గురువారం ఇక్కడ జరిగిన ఎజెండా ఆజ్‌తక్ కార్యక్రమంలో పాల్గొన్న హజారే మాట్లాడుతూ, ‘‘ఉద్యమం కీలక మలుపుకు చేరుకున్న సమయంలో పార్టీని ఏర్పాటు చేయడం సరైంది కాదు’’ అని పేర్కొన్నారు.
‘‘మా బృందం పటిష్టంగా ఉండి, ఐక్యంగా ముందుకు సాగి ఉంటే నేడు దేశ పరిస్థితి మరో విధంగా ఉండేది’’ అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన పేరును ఉపయోగించి నిధులు వసూలు చేయరాదని కోరుతూ తాను కేజ్రీవాల్‌కు లేఖ రాశానని అన్నా చెప్పారు. తన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఈ నెల 10 నుంచి పునఃప్రారంభించనున్నానని తెలిపారు. పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆరు రాష్ట్రాలలో పర్యటించానని చెప్పారు. కేజ్రీవాల్ సహా ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కూడా తనతోపాటు వేదికను పంచుకొనే అవకాశం ఇవ్వబోనని అన్నా స్పష్టం చేశారు.
అవినీతి వ్యతిరేకోద్యమం సందర్భంగా నిధులు వసూలు చేశారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రశ్నించగా, తన జీవితంలో డబ్బుతో పని లేదని కోర్టుకు చెబుతానని అన్నా పేర్కొన్నారు. ‘‘నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. డబ్బెవరు వసూలు చేశారో, దానిని ఎవరు వాడుకున్నారో నాకు తెలియదు’’ అని అన్నారు.కేజ్రీవాల్‌తో విభేదాలు అంత ప్రాముఖ్యమైనవి కావని చెప్పారు. దేశాన్ని ఎలా మార్చాలో ఆలోచించేందుకు ఇక్కడ చేరామని, అన్నా, అర్వింద్‌ల మధ్య పోరాటంతో దేశం మారదని చమత్కరించారు. తనకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ రెండేళ్లలో ఏమీ మార్పు లేదని ఆయన లోక్‌పాల్ బిల్లుపై వ్యాఖ్యానించారు. లోక్‌సభకు ప్రజలు మచ్చలేని నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement