బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకానికి గడువు ముగియడంతో పోలీసులు భద్రత లేని కేంద్రాలను వరుసగా మూసి వేయించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. రాత్రి ఏడు గంటల నుంచి పోలీసులు కార్యాచరణలోకి దిగారు. గార్డులు లేని కేంద్రాలను నిర్దాక్షిణ్యంగా మూసి వేయించారు. ఏటీఎంల వద్ద 24 గంటలూ కాపలా ఉండాలి, లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.... తదితర సుమారు 12 మార్గదర్శకాలను పోలీసులు బ్యాంకులకు సూచించారు.
ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు అధికారులకు పెద్దగా ఏటీఎంలను మూసివేసిన సంగతి తెలియలేదు. అయితే పోలీసులు మాత్రం అందుబాటులో ఉన్న బ్యాంకు సిబ్బందికి ఏటీఎంలను మూసి వేయించిన సంగతిని తెలియపరిచారు. గత మంగళవారం బీబీఎంపీ సర్కిల్ వద్ద కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేడు. ఈ సంఘటన అనంతరం ప్రతి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే.
ఏటీఎంలే హాంఫట్...: నగరంలో ఈ ఏడాదిలో ఏకంగా మూడు ఏటీఎంలను ఆగంతుకులు పెకిలించుకుని పోయారు. వీటిలో ఒక దానిని మాత్రమే పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. సెక్యూరిటీ గార్డులను హత్య చేసి ఏటీఎంలను దోచుకోవడానికి కూడా జరిగాయి.
ఖాతాదారులపై అదనపు భారం : అదనపు భద్రతా సిబ్బంది నియామకం బ్యాంకులకు మరింత భారం కానుంది. నగరంలో ఒక్కో ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీకి రూ.15 వేలు జీతం. అలా మూడు షిఫ్టుల్లో అంటే నెలకు ఒక్కో ఏటీఎంకు రూ.45 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇలా నగరంలో మొత్తం సుమారు 2500 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. వాటి వద్ద భద్రత కోసం ప్రతి నెలా రూ. 11.25 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏటీఎంల వల్ల బ్యాంకులకు 30 శాతం వరకు పని భారం, ఖర్చు తగ్గుతోంది. గార్డులుగా నియమించే మాజీ సైనికులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఔట్‌సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకుంటే కూడా ఖర్చు ఎక్కువే.
ఈసారి బడ్టెట్‌లో భద్రతా సిబ్బంది కోసమే ప్రత్యేక పద్దును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని పలువురు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ భారాన్ని ఇప్పటికిప్పుడే కాకపోయినా భవిష్యత్తులోనైనా ఖాతాదారులపై మోపాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం రాత్రి షిఫ్టుల్లో మాత్రమే గార్డులు ఉండే వారు. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ గార్డులను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖాతాదారుల వద్ద ఏటీఎం చార్జీలుగా రూ.20 (ఆర్థిక), రూ.5 (ఆర్థికేతర) వసూలు చేస్తున్నారు.
నగదు విత్‌డ్రాను ఆర్థిక లావాదేవీగా, నిల్వ తనిఖీ, మినీ స్టేట్‌మెంట్లను ఆర్థికేతర లావాదేవీలుగా పరిగణిస్తున్నారు. కాగా బెంగళూరులో మొత్తం 2580 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. అందులో 1137 కేంద్రాలు మూతపడడంతో ఖాతాదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇతర ఏటీఎం కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. కాగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడానికి మరి కొంత గడువు ఇవ్వాలని కోరుతూ పలు బ్యాం కుల ప్రతినిధి బృందాలు నగర పోలీసు కమిషనర్ ఔరాద్కర్‌ను సోమవారం కలిశాయి. అయితే వారి విన్నపాన్ని ఆయన తోసిపుచ్చారు.
బ్యాంకు అధికారుల అసహనం : తక్కువ గడువునిచ్చి చెప్పా పెట్టకుండా ఏటీఎం కేంద్రాలను పోలీసులు మూసి వేయించడంపై వివిధ బ్యాంకుఅధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించే పని లో తాము కూడా నిమగ్నమై ఉన్నామని, మధ్య లో శని, ఆదివారాలు రావడంతో కొంత జాప్యం జరిగిందని చెబుతున్నారు. మొత్తానికి దీనిపై స్థానికంగా తాము నిర్ణయాలు తీసుకోలేమని, ఏదైనా ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందని వివరించారు.
ఏటీఎంల మూత
Published Tue, Nov 26 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement