ఆస్పత్రుల్లో నిఘా | Attacks on hospitals, doctors | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో నిఘా

Published Tue, Aug 20 2013 6:42 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM

Attacks on hospitals, doctors

ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులు, శిశువుల అపహరణల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రసూతి ఆస్పత్రుల్లో భద్రతకు వాచ్‌మన్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు 868 మంది వాచ్‌మన్ల నియూమకానికి ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ఆదేశాలిచ్చారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రసూతి విభాగాల్లో శిశువులు అపహరణకు గురవుతున్నారు. కొన్ని చోట్ల సిబ్బంది, మరికొన్ని చోట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా శిశువులు మాయమవుతున్నారు. ఇలాంటి పరిణామాలు ఆస్పత్రులపై, సిబ్బందిపై దాడికి దారి తీస్తున్నాయి. అపహరణ కేసులు పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొంది. ఆస్పత్రుల్లో భద్రతను పెంచేందుకు నిర్ణయించింది. వాచ్‌మెన్ల నియామకానికి రంగం సిద్ధం చేసింది.
 
 ప్రకటన విడుదల: ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులపై దాడులు, శిశువుల అపహరణల్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రసూతి విభాగాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, భద్రతకు వాచ్‌మన్లను నియమించనున్నామని తెలిపారు. 
 
 తొలి విడతగా 868 మంది వాచ్‌మన్లను నియమించనున్నట్లు ప్రకటించారు. అలాగే కీల్పాకం ఆస్పత్రిలోని పిల్లల విభాగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. నర్సింగ్ కళాశాలల భవనాలు, హాస్టల్ నిర్మాణాలు, కొన్ని ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్ల అభివృద్ధి నిమిత్తం నిధులు కేటాయించినట్లు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement