పోలీసుల తీరుకు నిరసనగా నగరంలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కమిషనరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రోడ్డెక్కిన ఆటోవాలా
Published Fri, Dec 27 2013 1:07 AM | Last Updated on Thu, Mar 28 2019 6:27 PM
సాక్షి, చెన్నై: పోలీసుల తీరుకు నిరసనగా నగరంలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కమిషనరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రధాన నగరాల్లో ఆటో చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో చార్జీల్ని ప్రకటించింది. కనీస చార్జీగా రూ.25, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.12 వసూలు చేయాలని ఆదేశించింది. అలాగే రాత్రుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేసుకునే వీలు కల్పించింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత ఆగస్టు 25న రాష్ట్ర రాజధాని నగరంలో కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. వీటిని అమలు చేయించేందుకు ప్రభుత్వం మూడు నెలలుగా కుస్తీలు పడుతోంది. అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా చార్జీల అమలులో ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
వీరి తీరుపై హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల భరతం పట్టే విధంగా అధికారులు సిగ్నల్స్‌లో ప్రయాణికుల హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్ మీటర్లు వేయని పక్షంలో ఆ హెల్ప్‌లైన్‌కు స్వయంగా గానీ, ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయడానికి వీలు కల్పించారు. ఫిర్యాదులు వెల్లు వెత్తుతుండడంతో రెండు రోజులుగా ఆటో వాలాలపై పోలీసులు జరిమానా మోత మోగిస్తున్నారు. మళ్లీ మళ్లీ పట్టుబడే ఆటోలను సీజ్ చేస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్ల ఆందోళన: నగరంలోని ఆటో డ్రైవర్లు పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. పూందమల్లి హైరోడ్డులో రాస్తారోకో చేశారు. అనంతరం కమిషనరేట్ ముట్టడికి బయలుదేరారు. మార్గమధ్యంలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీటర్లను మరమ్మతులు చేయడానికి నగరంలో సరైన మెకానిక్కులు లేరని,
ఎవరి వెంట నడుద్దాం..?వాటిని ఎలా ఉపయోగించాలని పోలీసుల్ని ప్రశ్నించారు. తాము మీటర్లు వేస్తున్నా, కొంతమంది అధికారులు పనిగట్టుకుని జరిమానాలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంతో కలిసి వెళుతున్నా, మీటర్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించడం విడ్దూరంగా ఉందని మండిపడ్డారు. మీటర్లు వేయని ఆటోలపై చర్యలు తీసుకున్నా పర్వాలేదని, మీటర్లు వేసినా, మీటర్లు మరమ్మతులకు గురైనా జరిమానా మోత మోగించడం భావ్యం కాదని నిలదీశారు. వీరి ఆందోళన కారణంగా కమిషనరేట్ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. పోలీసులు తీవ్రంగా హెచ్చరించడంతో ఆందోళన విరమించారు. అనంతరం కమిషనరేట్‌లోని ఫిర్యాదుల విభాగంలో తమ డిమాండ్లు, విజ్ఞప్తుల్ని లిఖిత పూర్వకంగా అందజేశారు.
Advertisement
Advertisement