ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌పై నగరవాసులకు ఆటోడ్రైవర్ల సంఘానికి చెందిన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌పై నగరవాసులకు ఆటోడ్రైవర్ల సంఘానికి చెందిన ఓ వర్గం ప్రచారం చేస్తోంది. హార్డ్ డిస్క్ సౌకర్యం కలిగిన జీపీఎస్ ఆధారిత మీటర్లద్వారా అందులో పరిశుభ్రతకు సంబంధించిన ఫొటోలను ఉంచింది. నగరంలో మొత్తం 80 వేల ఆటోలు ఉన్నాయి. ఇందులో 35 వేల ఆటోలకు జీపీఎస్ వెసులుబాటు ఉంది. వీటిలో 2,100 ఆటోల యజమానులు జీపీఎస్ మీటర్లద్వారా ప్రధానమంత్రి స్వచ్ఛ్ భారత్‌కు సంబంధించిన ఫొటోలు ప్రయాణికులు చూసేవిధంగా తగు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు సైతం పాల్గొనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు.
కాగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాల క్రితం నగరపరిధిలో సంచరిస్తున్న ఆటోలకు ప్రభుత్వం జీపీఎస్ ఏర్పాటును తప్పనిసరి చేసింది. తమ ఆటోలోని జీపీఎస్ ఆధారిత మీటర్లలోగల హార్డ్‌డిస్కులలోకి మోదీ పరిశుభ్రతా కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. పరిశుభ్రత కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలంటూ మోదీ ప్రజలకు విన్నవిస్తున్న చిత్రాలను తమ ఆటోల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలంటూ ప్రయాణికులకు విన్నవిస్తున్నారు.
ఇదో మంచి కార్యక్రమం: రాజేంద్ర సోని
ఈ విషయమై ఆటోరిక్షా సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోని మాట్లాడుతూ ఇదో మంచి కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. దాదాపు 2,100 ఆటోలు ఈ ప్రచార పర్వంలో పాలుపంచుకుంటున్నాయన్నారు. అనేకమంది ఆటోవాలాలు దీనికి మద్దతు పలుకుతున్నారన్నారు.