కుదిపేసిన తొగాడియా
బీజేపీ సభ్యుల ధర్నాతో రెండు సార్లు సభ వాయిదా
తుగ్లక్‌ల పాలన సాగుతోందంటూ పరిషత్‌లో ఈశ్వరప్ప మండిపాటు
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా... బెంగళూరు ప్రవేశంపై నగర పోలీసులు నిషేధం విధించడంపై ఉభయ సభల్లోనూ వాడీవేడి చర్చ జరిగింది. నిషేధాన్ని ఖండిస్తూ విధానసభ, విధానపరిషత్‌లో బీజేపీ సభ్యులు ధర్నాకు దిగడంతో సభా కార్యకలపాలకు తీవ్రవిఘాతం కలిగింది. ఈ కారణంగా విధానసభ రెండు సార్లు వాయిదా పడింది.
సభలో గందరగోళం బుధవారం ఉదయం విధానసభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోక్ మాట్లాడుతూ....‘ఫిబ్రవరి 8న నగరంలో విశ్వహిందూ పరిషత్ సువర్ణ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ప్రవీణ్ తొగాడియాపై ఎందుకు నిషేధం విధించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడా లేని నిషేధం ఇక్కడెందుకు’ అని ప్రశ్నించారు. దీంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ వ్యక్తిని రాష్ట్రంలోకి రానివ్వకుండా నిషేధం విధిస్తాం, అందులో భాగంగానే ప్రవీణ్ తొగాడియాపై కూడా నిషేధం విధించాం’ అని సమాధానమిచ్చారు.
ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధానసభలో ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. దీంతో విధానసభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను గంట పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ సభ్యులు తమ ధర్నాను కొనసాగించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందంటూ బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. బీజేపీ నేతలకు జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున కూబా మద్దతుగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పురాకపోవడంతో మద్యాహ్నం 2.30గంటల వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇలా రెండు సార్లు ఎలాంటి చర్చ లేకుండానే విధానసభ వాయిదా పడింది. భోజన విరామంత తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను గురువారానికి వాయిదా వేశారు.
విధానపరిషత్‌లోనూ
విధానపరిషత్‌లోనూ ప్రవీణ్ తొగాడియా నిషేధంపై పెద్ద దుమారమే చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయాని కంటే ముందే ఈ విషయంపై చర్చించాలని పరిషత్‌లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల సమయంలోనే చర్చించేందుకు అనుమతివ్వాలని అధికార పక్ష నేతలు సైతం పట్టుబట్టారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కె.ఎస్.ఈశ్వరప్ప, గో.మధుసూధన్, నారాయణస్వామి తదితరులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. విధానపరిషత్‌లో పరిస్థితి గందరగోళంగా మారడంతో సభ అధ్యక్షుడు శంకరమూర్తి సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రవీణ్ తొగాడియాకు నిషేధం విధించడానికి ఇదేమైనా పాకిస్తానా, ఆప్ఘనిస్తానా అని ఈశ్వరప్ప ఘాటుగా ప్రశ్నించారు. సభ అధ్యక్షుడు శంకరమూర్తి కలగజేసుకొని ఇరు పక్షాల వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది.
హైకోర్టులో ప్రవీణ్ తొగాడియా రిట్
బెంగళూరు : తనను బెంగళూరుకు రాకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ద్వారా భారతదేశ పౌరుడిగా తనకు దక్కాల్సిన ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారని రాష్ర్ట హైకోర్టులో విశ్వహిందూపరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బుధవారం రిట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది.