Praveen togadiya
-
వారంలో రామ మందిరంపై నిర్ణయం: వీహెచ్‌పీ
మథుర: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా శనివారం అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారతీయులు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న హిందువులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆయన కోరారు. గోరక్షకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధాలను వెనక్కు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గోవులను కోస్తున్న కసాయి వారికి శిక్ష వేయాలని గోరక్షకులు కేవలం ఆవులను రక్షిస్తున్నారని తొగాడియా అన్నారు. -
శత్రువు అవ్వాలని ఉంటే ఏం చేయలేం
♦ ఇక్కడ పుట్టినవారంతా మా సోదరులే.. ♦ వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా కరీంనగర్ కల్చరల్: భారతదేశంలో ఉంటూ శత్రువు కావాలని వారికుంటే ఏమీ చేయలేమని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా అన్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తల శిక్షణకు ఆదివారం హాజరైన ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారతమాతాకీ జై అంటే వారు తమ వారేనని, భారతదేశం అంటే ఇష్టంలే ని వారికి ఈ దేశంలో స్థానం లేదన్నారు. ఇక్కడ పుట్టిన వారు తమ సోదరులేనని, భాయి భాయి అంటూనే శత్రువుగా తయారుకావాలని చూస్తుంటే ఏం చేసేది లేదని, వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిం చారు. రానున్న వందేళ్లలో హిందూ దేశంలోనే హిం దువులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రభాతసేవలో ప్రవీణ్ తొగాడియా వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్టు సభ్యుడు జి. భానుప్రకాష్‌రెడ్డి ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి సేవలో ప్రవీణ్ తొగాడియా
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున 3గంటలకు సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాష్‌రెడ్డి ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లుచేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి రెండు బంగారు శంఖుల కానుక కాగా.. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో వినియోగించేందుకు ఆదివారం రెండు బంగారు శంఖులు కానుకగా అందాయి. సుమారు రూ.50 లక్షల విలువైన ఈ శంఖులను టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావుకు అజ్ఞాత భక్తులు అందజేశారు. వీటిని ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో వినియోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
ప్రవీణ్ తొగాడియాపై మరోసారి నిషేధం
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కర్ణాటకలో ప్రవేశించకుండా ఆ రాష్ర్ట హోం శాఖ వారం పాటు(మార్చి 7 నుంచి మార్చి 13 వరకు) నిషేధం విధించింది. ఈ నెల 9న ఉడిపిలో జరిగే హిందూ సంజోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఉడిపి జిల్లా ఎస్పీ అన్నామలై శనివారం సాయంత్రం తెలిపారు. -
వీళ్లేమైనా ‘తాగి వచ్చారా?’
అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప గరం బెంగళూరు : ‘వీళ్లేమైనా తాగి వచ్చారా’ అధ్యక్షా అంటూ అధికార పక్ష సభ్యులపై విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మండిపడ్డారు. గురువారం ఉదయం పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశంపై చర్చ కొనసాగింది. ఈ చర్చకు అడ్డుతగులుతున్న అధికార పక్ష సభ్యులపై ఈశ్వరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రవీణ్ తొగాడియా ఓ దేశభక్తుడు, ఆయన మాట్లాడేందుకు ఈ రాష్ట్రంలో అవకాశం లభించలేదంటే ఈ రాష్ట్రం భారత్‌లో ఉన్నట్లా? లేక పాకిస్తాన్‌లోనా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఈశ్వరప్ప ప్రసంగానికి అధికాపక్ష సభ్యులు అడ్డుతగిలారు. ఈ పరిణామంతో మరింత ఆగ్రహానికి లోనైన ఈశ్వరప్ప ‘వీళ్లేమైనా తాగి వచ్చారా? అధికార పక్ష సభ్యులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?’ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టసభల్లో ప్రతిపక్ష నేతలు ఈ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఈశ్వరప్ప వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. -
అదే జోరు
రగిలిన తొగాడియా వివాదం నిషేధాన్ని తొలగించబోమన్న సిద్ధరామయ్య విధానసభ నుంచి బీజేపీ వాకౌట్ బెంగళూరు : విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశం గురువారం సైతం ఉభయ సభల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బీజేపీ సభ్యులు విధానసభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీజేపీ సభ్యుల ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోమని, ప్రవీణ్ తొగాడియాపై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన పరిషత్‌లో ప్రకటించారు. బీజేపీ సభ్యుల వాకౌట్... ప్రవీణ్ తొగాడియా నగర నిషేధం అంశం గురువారం సైతం విధానసౌధలో ప్రతిధ్వనించింది. గురువారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు జగదీష్ శెట్టర్, ఆర్.అశోక్, బసవరాజ బొమ్మాయిలు సభ వెల్‌లోకి దూసుకెళ్లి ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహులను ప్రోత్సహించడంతో పాటు దేశభక్తులను ఇబ్బందులకు గురిచేస్తోందని నినాదాలు చేశారు. నగరంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభలో ప్రవీణ్ తొగాడియా పాల్గొనకుండా నిషేధం విధించడం ఏమాత్రం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రవీణ్ తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారేమోననే ఊహలతో ఆయనపై నిషేధం విధించడం సరికాదని బీజేపీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగింది. అనంత ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు ఇక ప్రవీణ్ తొగాడియా పై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన పరిషత్‌లో వెల్లడించారు. ప్రవీణ్ తొగాడియాను నిషేధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై విధంగా స్పందించారు. బీజేపీ నేతల ఒత్తిళ్లు బెదిరింపులకు ప్రభుత్వం ఏ మాత్రం బెదరదని ఆయన స్పష్టం చేశారు. ప్రవీణ్ తొగాడియా నిషేధానికి సంబంధించి ఎలాంటి పరిణామాన్నైనా సరే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రవీణ్ తొగాడియాపై దేశ వ్యాప్తంగా 46 కేసులున్నాయని, తొగాడియా మంచివాడైతే ఇన్ని కేసులు ఆయనపై ఎందుకు నమోదవుతాయని సిద్ధరామయ్య బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. గతంలో కూడా రాష్ట్రంలో ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించిన సందర్భాలున్నాయని సిద్ధరామయ్య గుర్తుచేశారు. ప్రవీణ్ తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారనే సమాచారం ఉన్నందువల్లే నగర పోలీస్ కమీషనర్ ఆయనపై నిషేధం విధించారని సిద్ధరామయ్య విధానపరిషత్‌కు వెల్లడించారు. -
కుదిపేసిన తొగాడియా
బీజేపీ సభ్యుల ధర్నాతో రెండు సార్లు సభ వాయిదా తుగ్లక్‌ల పాలన సాగుతోందంటూ పరిషత్‌లో ఈశ్వరప్ప మండిపాటు బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా... బెంగళూరు ప్రవేశంపై నగర పోలీసులు నిషేధం విధించడంపై ఉభయ సభల్లోనూ వాడీవేడి చర్చ జరిగింది. నిషేధాన్ని ఖండిస్తూ విధానసభ, విధానపరిషత్‌లో బీజేపీ సభ్యులు ధర్నాకు దిగడంతో సభా కార్యకలపాలకు తీవ్రవిఘాతం కలిగింది. ఈ కారణంగా విధానసభ రెండు సార్లు వాయిదా పడింది. సభలో గందరగోళం బుధవారం ఉదయం విధానసభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోక్ మాట్లాడుతూ....‘ఫిబ్రవరి 8న నగరంలో విశ్వహిందూ పరిషత్ సువర్ణ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ప్రవీణ్ తొగాడియాపై ఎందుకు నిషేధం విధించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడా లేని నిషేధం ఇక్కడెందుకు’ అని ప్రశ్నించారు. దీంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ వ్యక్తిని రాష్ట్రంలోకి రానివ్వకుండా నిషేధం విధిస్తాం, అందులో భాగంగానే ప్రవీణ్ తొగాడియాపై కూడా నిషేధం విధించాం’ అని సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధానసభలో ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. దీంతో విధానసభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను గంట పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ సభ్యులు తమ ధర్నాను కొనసాగించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందంటూ బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. బీజేపీ నేతలకు జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున కూబా మద్దతుగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పురాకపోవడంతో మద్యాహ్నం 2.30గంటల వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇలా రెండు సార్లు ఎలాంటి చర్చ లేకుండానే విధానసభ వాయిదా పడింది. భోజన విరామంత తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను గురువారానికి వాయిదా వేశారు. విధానపరిషత్‌లోనూ విధానపరిషత్‌లోనూ ప్రవీణ్ తొగాడియా నిషేధంపై పెద్ద దుమారమే చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయాని కంటే ముందే ఈ విషయంపై చర్చించాలని పరిషత్‌లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల సమయంలోనే చర్చించేందుకు అనుమతివ్వాలని అధికార పక్ష నేతలు సైతం పట్టుబట్టారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కె.ఎస్.ఈశ్వరప్ప, గో.మధుసూధన్, నారాయణస్వామి తదితరులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. విధానపరిషత్‌లో పరిస్థితి గందరగోళంగా మారడంతో సభ అధ్యక్షుడు శంకరమూర్తి సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రవీణ్ తొగాడియాకు నిషేధం విధించడానికి ఇదేమైనా పాకిస్తానా, ఆప్ఘనిస్తానా అని ఈశ్వరప్ప ఘాటుగా ప్రశ్నించారు. సభ అధ్యక్షుడు శంకరమూర్తి కలగజేసుకొని ఇరు పక్షాల వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. హైకోర్టులో ప్రవీణ్ తొగాడియా రిట్ బెంగళూరు : తనను బెంగళూరుకు రాకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ద్వారా భారతదేశ పౌరుడిగా తనకు దక్కాల్సిన ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారని రాష్ర్ట హైకోర్టులో విశ్వహిందూపరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బుధవారం రిట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. -
తొగాడియాపై ఎఫ్ఐఆర్
భావ్‌నగర్: భిన్న మతాల మధ్య విద్వేషానికి కారణమయ్యేలా వ్యాఖ్యలు చేసిన విశ్వహిందూ పరిష త్ నేత ప్రవీణ్ తొగాడియాపై గుజరాత్‌లోని భావ్‌నగర్ పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందువులు అధికంగా ఉన్న ఓ ప్రాంతం లో ముస్లిం వ్యాపారి కొన్న ఇంటిని బలవంతంగా ఆక్రమించుకోవాలని తొగాడియా పిలుపునివ్వడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకుంటే బలవంతంగా స్వాధీనం చేసుకుని, భజరంగ్‌దళ్ పేరుతో బోర్డు తగిలించాలని తొగాడియా సూచించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.దీంతో తొగాడియాపై సెక్షన్ 153 (ఎ), సెక్షన్ 153(బి)తోపాటు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందున సెక్షన్ 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు భావ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సోలంకి వెల్లడించారు. తొగాడియా వీడియోలను పరిశీలిస్తున్నామని... ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. గిరిరాజ్‌పై నిషేధం: ఎన్నికల తర్వాత మోడీ వ్యతిరేకులు పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్‌పై ఈసీ నిషేధం విధించింది. బీహార్, జార్ఖండ్‌లలో ప్రచా రం నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, తొగాడియా, గిరిరాజ్ వ్యాఖ్య లను ఖండిస్తున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. బీజేపీ మేలు కోరేవారని చెప్పుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారాన్ని పక్కదారి పట్టిస్తున్నాయన్నారు. -
ప్రవీణ్ తొగాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు
భావ్‌నగర్: భిన్న మతాల మధ్య విద్వేషానికి కారణమయ్యేలా వ్యాఖ్యలు చేసిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాపై గుజరాత్‌లోని భావ్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం భావ్‌నగర్‌లో పర్యటించిన సందర్భంగా తొగాడియా మాట్లాడుతూ... హిందువులు అధికంగా ఉన్న మేఘాని ప్రాంతంలో ఒక ముస్లిం వ్యాపారి కొనుగోలు చేసిన ఇంటిని బలవంతంగా ఆక్రమించుకోవాలని భజరంగ్‌దళ్ కార్యకర్తలకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తొగాడియాపై చర్యలు చేపట్టాలని, దానిపై తమకు నివేదిక పంపాలని ఎన్నికల సంఘం(ఈసీ) భావ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తొగాడియాపై సెక్షన్ 153(ఎ), సెక్షన్ 153(బి )తోపాటు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందున సెక్షన్ 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు భావ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పీకే సోలంకి మంగళవారం వెల్లడించారు. మరోవైపు, తొగాడియాతోపాటు, బీహార్ బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. అవసరమైతే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముందని చెప్పాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన వ్యతిరేకులకు దేశంలో చోటు లేదని, వారు పాకిస్థాన్ వెళ్లాల్సి ఉంటుందని గిరిరాజ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
హిందూ ప్రాంతాల్లో ముస్లింల ఇళ్లు వద్దు!
వీహెచ్‌పీ నేత తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ సహా పలు పార్టీల ఆగ్రహం తొగాడియా విషం చిమ్ముతున్నారు.. తాలిబన్లలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య తొగాడియా ప్రసంగాన్ని పరిశీలించనున్న ఈసీ న్యూఢిల్లీ/రాజ్‌కోట్: హిందువులు నివసించే ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధించాలంటూ వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. తొగాడియా తన వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. మోడీ అధికారంలోకి వస్తే.. ఎలాం టి పరిస్థితి నెలకుంటుందో దీనితో స్పష్టమవుతోందని ఆరోపించాయి. గుజరాత్‌లోని భావనగర్‌లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక ముస్లిం ఇల్లు కొనుగోలు విషయం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో ముస్లింలు ఇలాగే చేస్తున్నారు. ముందు ఒక ఇంటిని ఎక్కువ ధరకు కొంటారు. తర్వాత మెల్లమెల్లగా చవగ్గా హిందువుల ఆస్తులు కొట్టేస్తారు. దీన్ని ఆపాలంటే హిందూ ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనకుండా నిరోధించాలి. ‘డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్’ను అమలు చేయాలి’’ అని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వివాదాస్పద ఇంటిని స్వాధీనం చేసుకోవాలంటూ స్థానికులను, బజరంగ్దళ్ కార్యకర్తలను రెచ్చగొట్టినట్లుగా ఆరోపణలొచ్చాయి. అయితే, దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు శనివారం ఒడిశాలో తొగాడియా చేసిన వ్యాఖ్యల వీడియోను పరిశీలించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని భావనగర్ కలెక్టర్ పీకే సోలంకి చెప్పారు. ప్రవీణ్ తొగాడియా ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉంటారని.. అలాంటివారికి దేశ సమైక్యత, సమగ్రతపై నమ్మకం లేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మండిపడ్డారు. తొగాడియా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన పరిస్థితి బాగోలేదని, ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కాంగ్రెస్ మరోనేత రషీద్ అల్వీ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని.. మోడీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో దీనితో తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. తొగాడియా తాలిబన్ల నుంచి స్ఫూర్తి పొందినట్లున్నారని జేడీయూ నేత కేసీ త్యాగి విమర్శించారు. తొగాడియాను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఫతేపురి మసీదు ముఫ్తి ముకర్రం డిమాండ్ చేశారు. తొగాడియా వ్యాఖ్యలను ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా తప్పుబట్టింది. అలాంటి వ్యక్తులకు భారత సమాజంలో చోటులేదని వ్యాఖ్యానించింది. నేనలా అనలేదు: తొగాడియా తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదని ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. ‘‘అవన్నీ తప్పుడు వార్తలు.. దురుద్దేశపూర్వకంగా వక్రీకరించారు. దీనిపై మీడియా సంస్థలకు నోటీసులు ఇస్తున్నాం’’ అని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొగాడియా అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని, వాటిని వక్రీకరించారని తొగాడియా తనతో చెప్పారని ఆర్ఎస్ఎస్ నేత రాం మాధవ్ చెప్పారు.