ప్రవీణ్ తొగాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు
భావ్‌నగర్: భిన్న మతాల మధ్య విద్వేషానికి కారణమయ్యేలా వ్యాఖ్యలు చేసిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాపై గుజరాత్‌లోని భావ్‌నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం భావ్‌నగర్‌లో పర్యటించిన సందర్భంగా తొగాడియా మాట్లాడుతూ... హిందువులు అధికంగా ఉన్న మేఘాని ప్రాంతంలో ఒక ముస్లిం వ్యాపారి కొనుగోలు చేసిన ఇంటిని బలవంతంగా ఆక్రమించుకోవాలని భజరంగ్‌దళ్ కార్యకర్తలకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తొగాడియాపై చర్యలు చేపట్టాలని, దానిపై తమకు నివేదిక పంపాలని ఎన్నికల సంఘం(ఈసీ) భావ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తొగాడియాపై సెక్షన్ 153(ఎ), సెక్షన్ 153(బి )తోపాటు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందున సెక్షన్ 188 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు భావ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పీకే సోలంకి మంగళవారం వెల్లడించారు.
మరోవైపు, తొగాడియాతోపాటు, బీహార్ బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. అవసరమైతే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముందని చెప్పాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన వ్యతిరేకులకు దేశంలో చోటు లేదని, వారు పాకిస్థాన్ వెళ్లాల్సి ఉంటుందని గిరిరాజ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.