అదే జోరు | The fire of controversy togadiya | Sakshi
Sakshi News home page

అదే జోరు

Published Fri, Feb 6 2015 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

అదే జోరు

అదే జోరు

రగిలిన తొగాడియా వివాదం
నిషేధాన్ని తొలగించబోమన్న   సిద్ధరామయ్య
విధానసభ నుంచి బీజేపీ వాకౌట్

 
బెంగళూరు : విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశం గురువారం సైతం ఉభయ సభల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బీజేపీ సభ్యులు విధానసభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీజేపీ సభ్యుల ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోమని, ప్రవీణ్ తొగాడియాపై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన పరిషత్‌లో ప్రకటించారు.

 బీజేపీ సభ్యుల వాకౌట్...

ప్రవీణ్ తొగాడియా నగర నిషేధం అంశం గురువారం సైతం విధానసౌధలో ప్రతిధ్వనించింది. గురువారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు జగదీష్ శెట్టర్, ఆర్.అశోక్, బసవరాజ బొమ్మాయిలు సభ వెల్‌లోకి దూసుకెళ్లి ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహులను ప్రోత్సహించడంతో పాటు దేశభక్తులను ఇబ్బందులకు గురిచేస్తోందని నినాదాలు చేశారు. నగరంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభలో ప్రవీణ్ తొగాడియా పాల్గొనకుండా నిషేధం విధించడం ఏమాత్రం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రవీణ్ తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారేమోననే ఊహలతో ఆయనపై నిషేధం విధించడం సరికాదని బీజేపీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగింది. అనంత ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు

ఇక ప్రవీణ్ తొగాడియా పై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన పరిషత్‌లో వెల్లడించారు. ప్రవీణ్ తొగాడియాను నిషేధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై విధంగా స్పందించారు. బీజేపీ నేతల ఒత్తిళ్లు బెదిరింపులకు ప్రభుత్వం ఏ మాత్రం బెదరదని ఆయన స్పష్టం చేశారు. ప్రవీణ్ తొగాడియా నిషేధానికి సంబంధించి ఎలాంటి పరిణామాన్నైనా సరే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రవీణ్ తొగాడియాపై దేశ వ్యాప్తంగా 46 కేసులున్నాయని, తొగాడియా మంచివాడైతే ఇన్ని కేసులు ఆయనపై ఎందుకు నమోదవుతాయని సిద్ధరామయ్య బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. గతంలో కూడా రాష్ట్రంలో ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించిన సందర్భాలున్నాయని సిద్ధరామయ్య గుర్తుచేశారు. ప్రవీణ్ తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారనే సమాచారం ఉన్నందువల్లే నగర పోలీస్ కమీషనర్ ఆయనపై నిషేధం విధించారని సిద్ధరామయ్య విధానపరిషత్‌కు వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement