హిందూ ప్రాంతాల్లో ముస్లింల ఇళ్లు వద్దు!
వీహెచ్‌పీ నేత తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ సహా పలు పార్టీల ఆగ్రహం
తొగాడియా విషం చిమ్ముతున్నారు.. తాలిబన్లలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య
తొగాడియా ప్రసంగాన్ని పరిశీలించనున్న ఈసీ
న్యూఢిల్లీ/రాజ్‌కోట్: హిందువులు నివసించే ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధించాలంటూ వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. తొగాడియా తన వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. మోడీ అధికారంలోకి వస్తే.. ఎలాం టి పరిస్థితి నెలకుంటుందో దీనితో స్పష్టమవుతోందని ఆరోపించాయి. గుజరాత్‌లోని భావనగర్‌లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక ముస్లిం ఇల్లు కొనుగోలు విషయం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో ముస్లింలు ఇలాగే చేస్తున్నారు. ముందు ఒక ఇంటిని ఎక్కువ ధరకు కొంటారు. తర్వాత మెల్లమెల్లగా చవగ్గా హిందువుల ఆస్తులు కొట్టేస్తారు.
దీన్ని ఆపాలంటే హిందూ ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనకుండా నిరోధించాలి. ‘డిస్టర్బ్‌డ్ ఏరియా యాక్ట్’ను అమలు చేయాలి’’ అని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వివాదాస్పద ఇంటిని స్వాధీనం చేసుకోవాలంటూ స్థానికులను, బజరంగ్‌దళ్ కార్యకర్తలను రెచ్చగొట్టినట్లుగా ఆరోపణలొచ్చాయి. అయితే, దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు శనివారం ఒడిశాలో తొగాడియా చేసిన వ్యాఖ్యల వీడియోను పరిశీలించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని భావనగర్ కలెక్టర్ పీకే సోలంకి చెప్పారు.
ప్రవీణ్ తొగాడియా ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉంటారని.. అలాంటివారికి దేశ సమైక్యత, సమగ్రతపై నమ్మకం లేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మండిపడ్డారు. తొగాడియా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన పరిస్థితి బాగోలేదని, ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కాంగ్రెస్ మరోనేత రషీద్ అల్వీ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని.. మోడీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో దీనితో తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. తొగాడియా తాలిబన్ల నుంచి స్ఫూర్తి పొందినట్లున్నారని జేడీయూ నేత కేసీ త్యాగి విమర్శించారు. తొగాడియాను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఫతేపురి మసీదు ముఫ్తి ముకర్రం డిమాండ్ చేశారు. తొగాడియా వ్యాఖ్యలను ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా తప్పుబట్టింది. అలాంటి వ్యక్తులకు భారత సమాజంలో చోటులేదని వ్యాఖ్యానించింది.
నేనలా అనలేదు: తొగాడియా
తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదని ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. ‘‘అవన్నీ తప్పుడు వార్తలు.. దురుద్దేశపూర్వకంగా వక్రీకరించారు. దీనిపై మీడియా సంస్థలకు నోటీసులు ఇస్తున్నాం’’ అని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొగాడియా అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని, వాటిని వక్రీకరించారని తొగాడియా తనతో చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్ నేత రాం మాధవ్ చెప్పారు.