దేశంలోనే అత్యధిక పబ్‌లతో ఐటీ సిటీ.. | Banglore Is Pub City In India | Sakshi
Sakshi News home page

పబ్‌.. లబ్‌డబ్‌

Published Wed, Jul 25 2018 10:46 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

Banglore Is Pub City In India - Sakshi

యువత ఏమాత్రం సమయం దొరికినా పబ్‌లలో వాలిపోతోంది. బీర్లు–మద్యం, మ్యూజిక్, డ్యాన్స్‌తో అక్కడ మజా చేస్తోంది. భారీ రేట్లతో జేబుకు భారమే అయినా సంపన్న యువత, అధిక ఆదాయ వర్గాలవారు పబ్‌లకు పరుగులు తీస్తుంటే బెంగళూరులో వాటి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఒక రకంగా దేశంలోనే అత్యధిక పబ్‌లతో బెంగళూరు వెలిగిపోతోంది.  

సాక్షి బెంగళూరు:  సిలికాన్‌ సిటీగా, గార్డెన్‌ సిటీగా ప్రసిద్ధిగాంచిన బెంగళూరు దేశంలోనే పబ్‌ సిటీగాను మారింది. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం దేశంలో అన్ని నగరాల కంటే ఎక్కువగా ఒక్క బెంగళూరులోనే 409 పబ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు నమోదైన ప్రకారం కర్ణాటక ప్రధాన నగరాల్లో మొత్తం 459 పబ్‌లు ఉండగా బెంగళూరులోనే 409 ఉన్నాయి. 26 పబ్‌లతో మంగళూరు రెండోస్థానంలో, 19 పబ్‌లతో మైసూరు మూడో స్థానంలో ఉన్నాయి.

4 ఏళ్లలో ఇబ్బడిముబ్బడి  
గత 2014లో బెంగళూరులో 269 పబ్‌లు ఉండేవి. అయితే ఈ నాలుగేళ్లలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తిపర కోర్సులు, ఉద్యోగాన్వేషణ కోసం దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో బెంగళూరుకు వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు పాశ్చాత్య దేశాల తరహాలో వారాంతపు రోజుల్లో వినోదాలు పబ్బులకు క్యూ కట్టడంతో ఎక్కడ స్థలం దొరికినా పబ్‌ వెలుస్తోంది. యువత తదితరుల కోసం బీరు, రకరకాల మద్యం కాక్‌టెయిల్స్, ఇక మ్యూజిక్, డ్యాన్స్‌ ఉండనే ఉంటాయి. 

ఆకర్షణలు అనేకం
బీబీఎంపీలో చేరిన నగర శివారు ప్రాంతాల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల యజమానులు కూడా పబ్బులుగా మార్చుకోవడంతో సంఖ్య పెరుగుతోంది.  ఇలా ఈ నాలుగేళ్లల్లో 50 శాతం పబ్‌లు పెరిగినట్లు ఎన్‌ఆర్‌ఏఐ బెంగళూరు విభాగ ముఖ్యస్థుడు మంజు చంద్ర తెలిపారు. నాలుగేళ్లలో పబ్బుల్లో అందించే ట్యాప్, టవర్, కెగ్‌ బీర్లకు యువత నుంచి ఆదరణ గణనీయంగా పెరగడం కూడా పబ్బుల సంఖ్య పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రతి నెలా 17 కెగ్‌ (ఒక కెగ్‌= 50 లీటర్ల బీర్‌లు)లు బీర్ల అమ్మడువుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 32 కెగ్‌లకు చేరుకుందని బార్‌ యజమాని తెలిపారు. కెగ్‌ బీర్ల విక్రయాల్లో లాభాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం, ప్రస్తుతం యువత సాధారణ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల కంటే పబ్‌లకు వెళ్లడానికే మక్కువ చూపుతుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 

అక్రమ పబ్‌లూ అధికమే  
అయితే పబ్‌ అని బోర్డు ఉన్నదల్లా నిజంగా ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. అనేక పబ్‌లకు సరైన అనుమతులు లేవు, మరికొన్నింటిలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. చాలా పబ్‌లు సాధారణ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లైసెన్స్‌పైనే నిర్వహిస్తున్నారు. చార్జీలు మాత్రం కళ్లు చెదిరేలా ఉంటున్నాయని ఫిర్యాదులున్నాయి. ఇక అక్రమంగా లైవ్‌డ్యాన్స్‌లకూ కొదవలేదు. ఇటీవల ఇందిరానగర్‌లో 30 పబ్‌లలో అక్రమంగా లైవ్‌బ్యాండ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంచి పబ్‌ కావాలనుకునేవారు నాలుగైదు పబ్‌లను సందర్శించి ఎంచుకోవడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement