బెంగళూరులో మొదటి భూగర్భ రైలు!
బెంగళూరు: ట్రాఫిక్ సమస్యలనుంచీ బయట పడేందుకు బెంగళూరు మరో అడుగు వేసింది. మొట్టమొదటి భూగర్భ మెట్రో రైల్ 'నమ్మ మెట్రో'ను నగరంలో త్వరలో ప్రారంభించనుంది. కోట్లాది రూపాయలతో సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆ మెగా అవస్థాపన ప్రణాళికలోని... భూగర్భ విభాగం శుక్రవారం అధికారిక ప్రారంభోత్సవం చేసింది. శాసన సభ భవనం విధాన సౌధా ఆ కార్యక్రమానికి వేదికైంది.
బెంగళూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరేందుకు అధికారులు మరో అడుగు ముందుకేశారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ప్రాజెక్టు లోని భూగర్భ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 42 కిలోమీటర్ల లైన్ లో 5 కిలోమీటర్ల పొడవు భూగర్భంలో విధాన సభతోపాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలగుండా ఈ లైన్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా బెంగళూరులోని రెండు ప్రధాన ప్రాంతాల్లోని నమ్మా మెట్రో రైల్ టన్నెల్ పనులను సిబ్బంది పరిశీలించారు. వేలమంది ఉద్యోగులు కలిగి ఉన్న విధాన సౌధ తమ సిబ్బంది సౌకర్యార్థం మెట్రోరైల్ కు సంబంధించిన ఓ స్టేషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటోంది. అయతే ఈ కొత్త భూగర్భ రైల్ విషయంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ విషయం మాత్రం ఓ సమస్యగా పరిణమించడమే కాక... నగరంలోని ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లకు కూడ సరైన మార్గం లేకపోవడం ఒకింత ఆలోచింపజేస్తోంది.
కొత్త భూగర్భ రైలు మార్గంతో తూర్పు పశ్చిమ విభాగంలోని... పశ్చిమాన ఉన్న మైసూర్ రోడ్ నుంచి తూర్పన బైప్పనహల్లి వరకు సుమారు 18 కిలోమీటర్ల ప్రయాణానికి 33 నిమిషాల సమయం పడుతుంది. తీవ్రమైన ట్రాఫిక్ ఉండే సమయాల్లో ఈ మార్గంలో వాహనాల్లో ప్రయాణించాలంటే గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఈ నూతన రైళ్ళు ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 వరకూ ప్రతి పది నిమిషాలకు ఈ మార్గంలో రైళ్ళు నడుస్తుంటాయి.
భూగర్భంలోని రాతిని దొలిచి ఏర్పాటు చేస్తున్న ఈ సొరంగ రైలు మార్గం ఇంజనీర్లకు కూడా ఛాలెంజింగ్ గానే మారింది. దీంతో కొంత సమయం ఎక్కువ పట్టడంతోపాటు, అధిక ఖర్చుకూడ అవుతోంది. ఇటీవలి కాలంలో భారీ సొరంగాలను తవ్వేందుకు బోరింగ్ మెషీన్లను, చిన్నవాటికి టీబీయం లను వాడుతున్నారని, ప్రస్తుతం 5 కిలోమీటర్ల పొడవున తవ్వాల్సిన ఈ నూతన రైలు మార్గానికి జపాన్ యంత్రాలు హెలెన్, మార్గరీటాలను వినియోగించినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ఈ యాంత్రాలతో సొరంగం తవ్వడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టినట్లు ఆయన తెలిపారు.