
చంద్రబాబు స్మగ్లర్ల ముఖ్యమంత్రి
► ‘ఎర్ర’దొంగలకు ‘పచ్చ’ నేతలు బాసటగా నిలుస్తున్నారు
► వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లు, దానికి కాపు కాస్తున్న పెదకాపు ప్రభుత్వం.. అంతా ఒక్కటై శేషాచల కొండల్లోని అపారమైన ప్రకృతి సంపదను కొల్లగొడు తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. వేలూరు, జావాది హిల్స్‌లో తిరువన్నావలైకి సంబంధించిన వాళ్లతో పచ్చ నేతలే ‘ఎర్ర’ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కోటానుకోట్ల ప్రకృతి సంపద తరలిపోతున్నా పట్టించుకోని స్మగ్లర్ల సీఎం చంద్రబాబు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ దోపిడీని ఎండగట్టారు. తాను అధికారంలో కొచ్చాక ఎర్రచందనం దొంగల్ని ఏరేస్తా.. ‘ఎర్ర’సంపదను కాపాడతానని బీరాలు పలికిన చంద్రబాబు.. దాన్ని దోచేస్తున్నారన్నారు.
టీడీపీవాళ్లు కోట్లకు కోట్లు సంపాదించాలని అడవితల్లిని వనరుగా మార్చారని మండిపడ్డారు. కేంద్రంతో మాట్లాడి పోర్టులన్నింటి వద్దా దొంగలను ఏర్పాటుచేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారన్నారు. ఇప్పటికీ రోజూ ఐదువేలమంది ‘ఎర్ర’కూలీలు శేషాచల అడవుల్లో పనిచేస్తూ.. రోజుకు రూ.100 కోట్ల సంపదను కొల్లకొడు తున్నారని చెప్పారు. అదే సమయంలో ఏమీ ఎరగనట్టుగా.. నారావారిపల్లెలోనే ఎర్రచందనం అక్రమ నిల్వలున్నాయి, నాకు చెడ్డపేరు తెస్తారా? అని చంద్ర బాబు సుద్దులు చెబుతున్నారని భూమన మండిపడ్డారు. రాందేవ్‌బాబా సీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను టన్ను 28.40 లక్షలకు కొన్నారని, అదే రూ.కోటి పలికే ఏ గ్రేడ్ ఎర్రచందనం 1,100 టన్నులు విక్రయిస్తే 92 వేలకే కోట్ చేయడం వెనుక రహస్యమేంటని నిలదీశారు. స్మగ్లర్లను అణచడం కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి వెంటనే చట్టాన్ని సవరించాలని కోరారు. ప్రత్యేక కలప అన్న మాట చేరిస్తే ఒక్క దుంగా బయటకు తరలిపోదన్నారు.