యాదగిరి, న్యూస్‌లైన్ : భవిష్యత్తులో ఇంధన కొరతను అధిగమించేందుకు జైవిక ఇంధనం ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అందుకు జిల్లాలోని తింథణి గ్రామం వద్ద 42 ఎకరాలు కొండ ప్రాంతాన్ని తీసుకుని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక రాష్ట్ర జైవిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో రూ. 6 కోట్ల వ్యయంతో బయో ఉద్యానవాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ పేర్కొన్నారు.
ఆయన సోమవారం యాదగిరి జిల్లా తింథణి వద్ద బయో పార్క్‌కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పార్క్ నిర్మాణం కోసం ప్రస్తుతం రూ.92 లక్షలు కేటాయించామని, మార్చి నెలాఖరులోగా మరో రూ.20 లక్షలు సమకూర్చుతామన్నారు. హైదరాబాద్-కర్ణాటకలోనే ఇది అతి పెద్ద పార్క్ అన్నారు. ఇప్పటికే వేప, జత్రోపా తదితర మొక్కలు నాటారని, వచ్చే ఐదేళ్లలో ఈ మొక్కల ద్వారా ప్రతి రోజూ 100 లీటర్ల ఇంధనం తయారు చేస్తారన్నారు.
విధానసౌధలోని గది గోడను పగులగొట్టమని తాను ఏ అధికారికి సూచించలేదని, అయితే గది గోడను పగులగొట్టడం వల్ల విధానసౌధ పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని, గోడ పగులగొట్టడం తప్పేమీ కాదన్నారు. జిల్లాలోని అనేక సాంఘిక సంక్షేమ శాఖ వసతి నిలయాలకు సొంత భవనాలు లేక అద్దె గదుల్లో నడిపిస్తున్నారని, అందువల్ల జిల్లా కేంద్రంలో అన్ని వసతి నిలయాలను ఒకే చోట నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇందుకు రూ.8 కోట్లు అవసరమవుతాయన్నారు. భవన నిర్మాణాలకు 10 ఎకరాల భూమిని కూడా అవసరముందని తెలిపారు.
త్వరలో సిబ్బంది నియామకం : సాంఘిక సంక్షేమ శాఖ వసతి నిలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, త్వరలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాబురావ్ చించనసూరు, దేవదుర్గ ఎమ్మెల్యే వెంక టేశ్ నాయక్, ఏహెచ్.హొన్నప్ప, జిల్లాధికారి ఎఫ్‌ఆర్.జమాదార తదితరులు పాల్గొన్నారు.
బయో పార్క్‌కు మంత్రి శంకుస్థాపన
Published Tue, Jan 14 2014 2:36 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement