Hyderabad - Karnataka
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ బేగంపేట్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్(45), అనిత(30), ప్రియ(15), మహేష్(2), డ్రైవర్ జగదీష్(30)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హర్షవర్దన జిల్లా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక కలబురిగి జిల్లా గంగాపూర్ దైవదర్శనానికి వెళ్లిన క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: యువతి చేష్టలతో విమానంలో గందరగోళం -
పంతుళ్ల కొరత తీరనుందిక
11 వేల మంది టీచర్ల నియామకం జూన్‌లో ప్రక్రియ పూర్తి విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో వచ్చే జూన్‌లో కొత్తగా 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. ప్రస్తుతం 24 వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, 11 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిందని వెల్లడించారు. గురువారం ఆయన్కికడ విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు 9,500 మందిని, ఉన్నత పాఠశాలలు, పీయూ కళాశాలలకు 1,500 మందిని నియమించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా లభించినందున, నియామకాలకు సంబంధించి ఇంకా విధి విధానాలు సిద్ధం కాలేదని చెప్పారు. కనుక నియామకాల్లో జాప్యం జరగవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల నియమావళి త్వరలో అమలులోకి రానున్నందున, జూన్‌లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన 13 వేల పోస్టులను దశల వారీ భర్తీ చేస్తామని తెలిపారు. బదిలీలపై ఆర్డినెన్స్ ఉపాధ్యాయుల బదిలీలపై ఆర్డినెన్స్‌ను తీసుకొస్తామని, లోక్‌సభ ఎన్నికల అనంతరం జూన్‌లో బదిలీలను చేపడతామని ఆయన వివరించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని, దీని వల్ల భార్య, భర్త వేర్వేరు చోట్ల పని చేయాల్సి వస్తోందన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా బదిలీలు కోరుకుంటున్న వారికి కూడా అవకాశం లభించడం లేదన్నారు. ఈ అంశాలను అఫిడవిట్ రూపంలో కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా కౌన్సెలింగ్‌ను పక్కన పెట్టి బదిలీలు చేపడతామని తెలిపారు. -
బయో పార్క్‌కు మంత్రి శంకుస్థాపన
యాదగిరి, న్యూస్‌లైన్ : భవిష్యత్తులో ఇంధన కొరతను అధిగమించేందుకు జైవిక ఇంధనం ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అందుకు జిల్లాలోని తింథణి గ్రామం వద్ద 42 ఎకరాలు కొండ ప్రాంతాన్ని తీసుకుని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక రాష్ట్ర జైవిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో రూ. 6 కోట్ల వ్యయంతో బయో ఉద్యానవాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ పేర్కొన్నారు. ఆయన సోమవారం యాదగిరి జిల్లా తింథణి వద్ద బయో పార్క్‌కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పార్క్ నిర్మాణం కోసం ప్రస్తుతం రూ.92 లక్షలు కేటాయించామని, మార్చి నెలాఖరులోగా మరో రూ.20 లక్షలు సమకూర్చుతామన్నారు. హైదరాబాద్-కర్ణాటకలోనే ఇది అతి పెద్ద పార్క్ అన్నారు. ఇప్పటికే వేప, జత్రోపా తదితర మొక్కలు నాటారని, వచ్చే ఐదేళ్లలో ఈ మొక్కల ద్వారా ప్రతి రోజూ 100 లీటర్ల ఇంధనం తయారు చేస్తారన్నారు. విధానసౌధలోని గది గోడను పగులగొట్టమని తాను ఏ అధికారికి సూచించలేదని, అయితే గది గోడను పగులగొట్టడం వల్ల విధానసౌధ పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని, గోడ పగులగొట్టడం తప్పేమీ కాదన్నారు. జిల్లాలోని అనేక సాంఘిక సంక్షేమ శాఖ వసతి నిలయాలకు సొంత భవనాలు లేక అద్దె గదుల్లో నడిపిస్తున్నారని, అందువల్ల జిల్లా కేంద్రంలో అన్ని వసతి నిలయాలను ఒకే చోట నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇందుకు రూ.8 కోట్లు అవసరమవుతాయన్నారు. భవన నిర్మాణాలకు 10 ఎకరాల భూమిని కూడా అవసరముందని తెలిపారు. త్వరలో సిబ్బంది నియామకం : సాంఘిక సంక్షేమ శాఖ వసతి నిలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, త్వరలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాబురావ్ చించనసూరు, దేవదుర్గ ఎమ్మెల్యే వెంక టేశ్ నాయక్, ఏహెచ్.హొన్నప్ప, జిల్లాధికారి ఎఫ్ఆర్.జమాదార తదితరులు పాల్గొన్నారు.