- 11 వేల మంది టీచర్ల నియామకం
- జూన్‌లో ప్రక్రియ పూర్తి
- విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో వచ్చే జూన్‌లో కొత్తగా 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. ప్రస్తుతం 24 వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, 11 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిందని వెల్లడించారు. గురువారం ఆయన్కికడ విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు 9,500 మందిని, ఉన్నత పాఠశాలలు, పీయూ కళాశాలలకు 1,500 మందిని నియమించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా లభించినందున, నియామకాలకు సంబంధించి ఇంకా విధి విధానాలు సిద్ధం కాలేదని చెప్పారు. కనుక నియామకాల్లో జాప్యం జరగవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల నియమావళి త్వరలో అమలులోకి రానున్నందున, జూన్‌లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన 13 వేల పోస్టులను దశల వారీ భర్తీ చేస్తామని తెలిపారు.
బదిలీలపై ఆర్డినెన్స్
ఉపాధ్యాయుల బదిలీలపై ఆర్డినెన్స్‌ను తీసుకొస్తామని, లోక్‌సభ ఎన్నికల అనంతరం జూన్‌లో బదిలీలను చేపడతామని ఆయన వివరించారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని, దీని వల్ల భార్య, భర్త వేర్వేరు చోట్ల పని చేయాల్సి వస్తోందన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా బదిలీలు కోరుకుంటున్న వారికి కూడా అవకాశం లభించడం లేదన్నారు. ఈ అంశాలను అఫిడవిట్ రూపంలో కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా కౌన్సెలింగ్‌ను పక్కన పెట్టి బదిలీలు చేపడతామని తెలిపారు.