బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి ఆత్మహత్యపై ప్రతిపక్ష బీజేపీతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు తీరును నిరసిస్తూ... 24గంటల నిరసన చేపట్టింది. బీజేపీ, జేడీఎస్ శాసనసభ్యులు రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండి ఆందోళన కొనసాగించారు.
అధికారపార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే ... కర్నాటకలో ఐపీఎస్ అధికారులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని నేతలు ఆరోపించారు. మంత్రి కేజే జార్జ్ పేరును బాధితుడు సూసైడ్ నోట్‌లో ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. మంత్రి రాజీనామా చేయడంతోపాటు... కేసును సీబీఐకి అప్పగించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు పోలీస్ అధికారి గణపతి ఆత్మహత్య కేసులో బీజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిరాకరించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేజే జార్జ్ మాత్రం బీజేపీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని... సరైన సాక్ష్యాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.