బీజేపీకి టీడీపీ ఝులక్
-
స్టాండింగ్ కమిటీలో దక్కని చోటు
-
గతంలో ఇచ్చిన హామీకి మంగళం
-
బీజేపీ స్పందనపై కార్పొరేషన్ వర్గాల్లో ఆసక్తి
రాజమహేంద్రవరం: మిత్ర పక్ష బీజేపీకి అధికార టీడీపీ చేయిచ్చింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో చోటు ఇవ్వకుండా వ్యూహం రచించింది. రెండో దఫా అవకాశం ఇస్తామన్న హామీని నెలబెట్టుకోకపోవడంతో ఇరు పార్టీల మధ్య పొరపొచ్చాలు బయటపడుతున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలక మండలి ఎన్నికలు 2014 ఏప్రిల్‌లో జరిగాయి. 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 34, వైఎస్సార్‌సీపీ 8, బీజేపీ 01, బీఎస్‌పీ 01, కాంగ్రెస్ 01, స్వతంత్రులు మరో ఐదు డివిజన్లలో గెలుపొందారు. మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ తమ సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసింది.
టీడీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో ప్రతి ఏడాది జరిగే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దఫా స్టాండింగ్ కమిటీలో తమకు చోటు కల్పించాలని బీజేపీ కోరింది. అయితే బీజేపీ మాటను పెడచెవిన పెట్టిన అధికార పార్టీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల నేతృత్వంలో ఐదు స్థానాలు తమ వారికే కట్టబెట్టింది. కడలి రామకృష్ట(1వ డివిజన్), పితాని లక్ష్మీకుమారి(2వ డివిజన్), బూర దుర్గాంజనేయుల రావు(27వ డివిజన్), గాడిరెడ్డి నరశింహరావు(33వ డివిజన్), సింహా నాగమణి(40వ డివిజన్)లు స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో స్టాండింగ్ కమిటీలో చోటు ఆశించిన బీజేపీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవీ(47వ డివిజన్)కి ఆశాభంగం తప్పలేదు. దీంతో ఆమె కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గోరంట్లతో మంతనాలు జరిపారు. వచ్చేసారి తప్పక స్థానం కల్పిస్తామని గోరంట్ల హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
ఈసారి రిక్తహస్తమే...
అయితే మూడో దఫాలో కూడా బీజేపీకి రిక్త హస్తమే ఎదురైంది. బుధవారంతో ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. ఐదు స్థానాలకు టీడీపీ తరఫున కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై అధికారపార్టీలో తీవ్ర స్థాయిలో మంతనాలు జరిగాయి. ఎవరిని సభ్యులుగా నియమించాలన్నదానిపై పలుమార్లు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నామినేషన్‌కు ముందు గోరంట్ల నివాసంలో సభ్యుల ఎంపికపై మంతనాలు జరిగాయి. చివరికి ఇన్నమూరి రాంబాబు(23వ డివిజన్), మజ్జి మౌనికా సుధారాణి(6వ డివిజన్), తంగేటి వెంకట లక్ష్మి(15వ డివిజన్), మానుపాటి తాతారావు(18వ డివిజన్), మళ్ల నాగలక్ష్మి(32వ డివిజన్) కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. ఇతరులు పోటీ చేయకపోవడంతో వచ్చే నెల 10న జరిగే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే గత ఏడాది తమకు ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ మిత్ర ధర్మాన్ని పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎమ్మెల్యే గోరంట్ల ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వారు మండిపడుతున్నారు. ఇలా అయితే తమకు ఇక విలువేముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హామీ నిలబెట్టుకోకపోవడంపై సోము వీర్రాజు ఏ విధంగా స్పందిస్తారు, దీనికి గోరంట్ల ఏం సమాధానం చెబుతారోనన్న చర్చ కార్పొరేషన్ వర్గాల్లో నడుస్తోంది.
ముఖ్య పాత్ర స్టాండింగ్ కమిటీదే...
కార్పొరేషన్ పాలక మండలి సాధారణ సమావేశం ప్రతి మూడు నెలలకోసారి జరుగుతుంది. ఈ సమావేశంలో నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, విధాన నిర్ణయాలుపై చర్చించి ఆమోదం తెలుపుతారు. అయితే మిగతా సమయంలో నగరంలో జరిగే అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ప్రతి వారం మేయర్ అధ్యక్షతన సమావేశమై రూ. 50 లక్షల లోపు పనులను ఆమోదిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం కోసం ప్రతి సారి కార్పొరేటర్లు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు.