
సర్కారు ఏర్పాటుపై కసరత్తు
- బీజేపీ నేతల విస్తృత మంతనాలు
- అద్వానీతో నరేంద్ర మోడీ భేటీ
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తన మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌తో విస్తృత మంతనాలు జరుపుతోంది. 20న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో హడావుడి నెలకొంది. పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఇక్కడి గుజరాత్ భవన్ నుంచి మోడీ నేరుగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత అద్వానీతో మోడీ సమావేశమవడం ఇదే తొలిసారి. శనివారం పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ సందర్భంగా వీరిద్దరూ కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్న సంగతి తెలిసిందే.
కాగా, 40 నిమిషాల పాటు జరిగిన వీరి తాజా భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది పార్టీ వర్గాలు వెల్లడించలేదు. అయితే ప్రభుత్వంలో అద్వానీ పాత్రపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనకు స్వతంత్రంగా వ్యవహరించగలిగే లోక్‌సభ స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత ఏడాది మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో అద్వానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరకు ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో ఆయన సర్దుకుపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఏర్పాటులో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వమే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, మోడీ రాకకు ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత్‌కుమార్ కూడా అద్వానీతో సమావేశమయ్యారు.
ఇక గుజరాత్ భవన్ వద్ద రోజంతా సందడి నెలకొంది. మంత్రి పదవుల ఆశావహులంతా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతున్నారు. ఇప్పటికే కర్ణాటక నేతలు బీఎస్ యడ్యూరప్ప, అనంత్‌కుమార్ మోడీని కలిశారు. బీహార్‌లో మిత్రపక్షంగా ఉండి ఆరు సీట్లు గెలుచుకున్న ఎల్‌జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తన కుటుంబంతో సహా వచ్చి మోడీని కలిశారు. నాగాలాండ్‌లో ఒక్క సీటు నెగ్గిన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) అధినేత నివ్యూరియో, బీహార్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మోడీతో చర్చలు జరిపారు. తన సన్నిహితుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, మరో ముఖ్య నేత జేపీ నడ్డాతోనూ మోడీ భేటీ అయ్యారు.
మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. పార్టీ నేతలు, సంఘ్ నాయకులతో మంతనాల్లో మునిగిపోయారు. అరుణ్ జైట్లీ, అమిత్ షా, రామ్‌లాల్ వంటి వారితో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇక బీజేపీ సీనియర్ నేతలు ఇక్కడి ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వెంకయ్యనాయుడు, కల్‌రాజ్ మిశ్రా, హర్షవర్థన్, గోపీనాథ్ ముండే, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఉమాభారతి తదితరులు సంఘ్ నాయకులతో నిరంతర చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఉండదంటూ నేతలంతా చెబుతున్నప్పటికీ మంత్రివర్గ కూర్పుపైనే ఈ చర్చలు సాగుతున్నట్లు సమాచారం. కాగా, తాజాగా ఎన్నికైన ఎంపీలతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి అందించింది. మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ర్టపతి ఆహ్వానించనున్నారు.
గుజరాత్ సీఎం ఎంపిక 21న
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ వారసుడిని ఎంపిక చేయడానికి ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షం బుధవారం సమావేశం కానుంది. దీనికోసం కేంద్ర పరిశీలకుడిగా తవర్ చంద్ గెహ్లాట్‌ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఆయన రాష్ట్ర ఇన్‌చార్జి ఓమ్ మాథుర్‌తో కలసి పనిచేస్తారు. ముఖ్యమంత్రి పోటీలో సీనియర్ మంత్రి ఆనందీ పటేల్, మోడీ అనుచరుడు అమి త్ షా, మంత్రులు నితిన్ పటేల్, సౌరభ్ పటేల్‌లతో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ భికుభాయ్ దల్‌సానియా కూడా ఉన్నారు. అయితే తన వారసుడి ఎంపికపై తుది నిర్ణయం మోడీదేనని పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా, మోడీకి వీడ్కోలు పలకడానికి ఈనెల 21న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అంతకుముందు రోజు తన అసెంబ్లీ స్థానం మణినగర్‌లో మోడీ ర్యాలీ నిర్వహించనున్నారు.