ఎమ్మెల్యే బిష్ణు సేథి
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ముస్లిం మహిళలనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికల్లో ముస్లిం మహిళలదే హవా అని అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథి వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేడీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయంపై చర్చిస్తూ సేథి పై విధంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్, అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రికార్డులనుంచి సేథి మాటలను తొలగించాలని డిమాండ్‌చేశారు. దీంతో మళ్లీ సేథి జీరో అవర్‌లో స్పందించారు. ‘వార్తాపత్రికలు, మేగజీన్లు చేసిన సర్వేల్లో వెల్లడైన వాస్తవాలనే నేను చెబుతున్నా. సర్వే వివరాలను చెప్పడంలో తప్పేముంది. ప్రత్యేకంగా ఏ వర్గాన్నో నేను తక్కువచేసి మాట్లాడటంలేదు. ముంబై, కోల్‌కతాల్లోని రెడ్‌లైట్ ఏరియాల్లో ముస్లిం మహిళలదే హవా అని ఆయా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని అన్నారు.
మైనార్టీల ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు ట్రిఫుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ట్రిఫుల్ తలాక్ బిల్లును ఆమోదించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 38 దేశాల్లో ట్రిఫుల్ తలాక్‌ను రద్దు చేశారని వెల్లడించారు. ఈ బిల్లుతో మతానికి సంబంధం లేదని, సామాజిక రుగ్మతను రూపుమాపాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కారు దీన్ని ఆమోదించినట్టు ఎమ్మెల్యే బిష్ణు సేథి వివరించారు. ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ నచ్చజెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను లంచ్ వరకు వాయిదా వేయాల్సివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment