గవర్నర్ ముంగిటికి చేరిన ‘వక్ఫ్’ వివాదం
గవర్నర్‌తో భేటీ అయిన బీజేపీ నేతలు
అన్వర్ మనప్పాడి నివేదికను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వానికి మార్గనిర్దేశనం
చేయాల్సిందిగా విన్నపం
శాసనమండలిని కుదిపేసిన వక్ఫ్ వ్యవహారం
నివేదికను ప్రవేశపెట్టాల్సిందేనని
బీజేపీ సభ్యుల ఆందోళన
బెంగళూరు: వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని ఆస్తుల అవకతవకలకు సంబంధించిన వివాదం గవర్నర్ వద్దకు చేరింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం ససేమిరా అంటుండడంతో ఈ విషమాన్ని విపక్ష బీజేపీ నేతలు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా దృష్టికి తీసుకెళ్లారు. వీరికి జేడీఎస్ నేతలు సైతం మద్దతు పలికారు. వీరంతా మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయి అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలంటూ విన్నవించారు. ఈ సందర్భంగా శాసనమండలిలో విపక్షనేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ....వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని 15 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ విషయంపై అన్వర్ మానప్పాడి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలని హైకోర్టు సైతం ఆదేశించిందని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో శాసనమండలి చైర్మన్ శంకరమూర్తి సైతం ఇందుకు సంబంధించి మూడు సార్లు రూలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. అందుకే ప్రస్తుతం ఈ విషయంలో గవర్నర్ కలగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాల్సిందిగా కోరామని చెప్పారు. ఇక వక్ఫ్ ఆస్తుల భారీ అవకతవకలపై సమాచారం తెలుసుకున్న గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఈశ్వరప్ప వెల్లడించారు.
మండలిలో అదే తీరు.......
కాగా, మంగళవారం సైతం శాసనమండలిని వక్ఫ్ వ్యవహారం కుదిపేసింది. గవర్నర్‌తో సమావేశానికి ముందు శాసనమండలిలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీరుపై నిప్పులు చెరిగాయి. అన్వర్ మానప్పాడి నివేదికను శాసనమండలిలో ప్రవేశపెట్టాల్సిందేనని కోరుతూ నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ.....న్యాయస్థానాల ఆదేశాలను, మండలి చైర్మన్ రూలింగ్‌ను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మండలి చైర్మన్ స్థానం అత్యంత ఉన్నతమైనదని, అటువంటిది చైర్మన్ ఆదేశాలను పాటించకపోతే మంత్రులు తమ స్థానాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'అవకతవకలపై గవర్నర్ ఆశ్చర్యం'
Published Wed, Mar 30 2016 12:07 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement
Advertisement