Vajubhai Rudabhai Vala
-
వాళ్లను షూట్ చేయాలి: కర్ణాటక గవర్నర్
సాక్షి, బెంగళూరు: పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ వర్ధంతి నిర్వహించేవారిని కాల్చి చంపాలని కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా బెంగళూరులో వ్యాఖ్యానించారు. కసబ్ లాంటి ఉగ్రవాదులు, దేశద్రోహులను పట్టుకున్న మూడ్రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలన్నారు. భద్రతలో పటిష్టంగా ఉన్న ఇజ్రాయెల్ లాంటి దేశమే అభివృద్ధిచెందుతుందని పేర్కొన్నారు. భారత్‌లో పరిస్థితులు వేరని అన్నారు. ‘ కొందరు కసబ్ వర్ధంతి నిర్వహిస్తున్నారు. వారిని తుపాకీతో కాల్చి మృతదేహాలు దొరక్కుండా చేయాలి’ అని అన్నారు. -
'అవకతవకలపై గవర్నర్ ఆశ్చర్యం'
గవర్నర్ ముంగిటికి చేరిన ‘వక్ఫ్’ వివాదం గవర్నర్‌తో భేటీ అయిన బీజేపీ నేతలు అన్వర్ మనప్పాడి నివేదికను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాల్సిందిగా విన్నపం శాసనమండలిని కుదిపేసిన వక్ఫ్ వ్యవహారం నివేదికను ప్రవేశపెట్టాల్సిందేనని బీజేపీ సభ్యుల ఆందోళన బెంగళూరు: వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని ఆస్తుల అవకతవకలకు సంబంధించిన వివాదం గవర్నర్ వద్దకు చేరింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం ససేమిరా అంటుండడంతో ఈ విషమాన్ని విపక్ష బీజేపీ నేతలు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా దృష్టికి తీసుకెళ్లారు. వీరికి జేడీఎస్ నేతలు సైతం మద్దతు పలికారు. వీరంతా మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయి అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలంటూ విన్నవించారు. ఈ సందర్భంగా శాసనమండలిలో విపక్షనేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ....వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని 15 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ విషయంపై అన్వర్ మానప్పాడి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలని హైకోర్టు సైతం ఆదేశించిందని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో శాసనమండలి చైర్మన్ శంకరమూర్తి సైతం ఇందుకు సంబంధించి మూడు సార్లు రూలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. అందుకే ప్రస్తుతం ఈ విషయంలో గవర్నర్ కలగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాల్సిందిగా కోరామని చెప్పారు. ఇక వక్ఫ్ ఆస్తుల భారీ అవకతవకలపై సమాచారం తెలుసుకున్న గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఈశ్వరప్ప వెల్లడించారు. మండలిలో అదే తీరు....... కాగా, మంగళవారం సైతం శాసనమండలిని వక్ఫ్ వ్యవహారం కుదిపేసింది. గవర్నర్‌తో సమావేశానికి ముందు శాసనమండలిలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీరుపై నిప్పులు చెరిగాయి. అన్వర్ మానప్పాడి నివేదికను శాసనమండలిలో ప్రవేశపెట్టాల్సిందేనని కోరుతూ నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ.....న్యాయస్థానాల ఆదేశాలను, మండలి చైర్మన్ రూలింగ్‌ను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మండలి చైర్మన్ స్థానం అత్యంత ఉన్నతమైనదని, అటువంటిది చైర్మన్ ఆదేశాలను పాటించకపోతే మంత్రులు తమ స్థానాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
రబ్బర్ స్టాంపును కాను : గవర్నర్
బెంగళూరు : శాసన, రాజ్యాంగ వ్యవస్థలు నాణేనికి రెండు ముఖాలని, రాజ్ భవన్ ఎప్పటికీ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రం కాకూడదని కొత్త గవర్నర్ వజూభాయ్ రుఢాభాయ్ వాలా అన్నారు. తాను ఈ పదవిలో ఉన్నంత వరకు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతానే తప్ప, ఎవరికో రబ్బర్ స్టాంపులా వ్యవహరించబోనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్తుడైనప్పటికీ, ఇప్పుడు గవర్నర్ కనుక రాజ్యాంగ ఆశయాలను కాపాడాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్ భవన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా, ప్రజల కోసం ఉన్న కార్యాలయంలా తీర్చి దిద్దుతానని చెప్పారు. ఒక రాష్ట్రం సంక్షేమ ప్రాంతం కావాలంటే ఒకరి నుంచే సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరూ సహకారం అందించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి సూచనలివ్వడంతో పాటు మార్గదర్శనం చేయడం గవర్నర్ కర్తవ్యమన్నారు. ప్రధానికి ఆప్తుడైనందునే తనను గవర్నర్‌గా నియమించారనడం సరికాదని అన్నారు. గుజరాత్లో ఆర్థిక శాఖ మంత్రిగా 18 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని వెల్లడించారు. కనుక ప్రజా సమస్యలేమిటో తనకు బాగా తెలుసునని చెప్పారు. సంక్షేమ రాష్ట్రం కావాలంటే నిర్ణీత వ్యవధిలో ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ప్రతి శాసన సభ్యుడు, మంత్రి భుజం భుజం కలిపినందున అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు. కర్ణాటకలోనూ అపార సహజ వనరులున్నాయని, ప్రభుత్వం కోరితే సలహాలు ఇస్తానని తెలిపారు. గత గవర్నర్ ఏం చేశారో, రాబోయే గవర్నర్ ఏం చేస్తారో...తనకు అవసరమని, కర్ణాటకలో తాను ఉన్నంత వరకు ప్రజల పక్షాన పని చేస్తానని వివరించారు. రాజ్ భవన్ అంటే కేవలం పుస్తక పఠనానికి, విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. గవర్నర్ ఎవరికో రబ్బర్ స్టాంపులా పని చేయరాదని చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అన్ని రకాల సహకారాలు అందిస్తానని తెలిపారు. చెడు దారిలో వెళుతుంటే హెచ్చరించడం తన కర్తవ్యమని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ఎవరిపైనో పగ తీర్చుకోవడం....లాంటి ఉద్దేశాలు తనకు లేనే లేవని స్పష్టం చేశారు. కేంద్రానికి తొత్తుగా పని చేయడానికి తనను ఇక్కడికి పంపలేదంటూ, గవర్నర్ పదవిని నిబాయించే సామర్థ్యం తనకు ఉందని చెప్పారు. కర్ణాటకలో ఉన్నంత వరకు సమర్థంగా, నిష్పక్షపాతంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.