సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ మార్చ్
Published Wed, Jan 29 2014 10:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతికి వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఖిడ్కా ఎక్స్‌టెన్షన్‌లో అర్ధరాత్రి సోదాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడం, ఉగాండాకు చెందిన బాధితురాలు కూడా సోమ్‌నాథ్‌ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే తమ ఆందోళనను అంచెలంచెలుగా పెద్దదిగా చేస్తోంది. తన కేబినెట్‌లో వివాదాస్పద మంత్రిగా మారిన సోమ్‌నాథ్ నుంచి రాజీనామా కోరాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బీజేపీ నేతలు ఇప్పటికే కలిశారు. సీఎం కార్యాలయంలో దాదాపు రెండు గంటలపాటు ధర్నాకు దిగారు.
తమ డిమాండ్లపై స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే బుధవారం విధానసభ నుంచి రాజ్‌నివాస్ వరకు మార్చ్ నిర్వహించారు. సోమ్‌నాథ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని నినాదాలు చేశారు. విధానసభలో ప్రతిపక్ష నేత డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ మార్చ్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సోమ్‌నాథ్ భారతి విదేశీ మహిళలను, ఢిల్లీ మహిళా కమిషన్‌ను, ఢిల్లీ పోలీసులను, ప్రముఖ నేతలను అవమానించారని హర్షవర్ధన్ ఆరోపించారు. సోమ్‌నాథ్ భారతిని మంత్రి పదవి నుంచి తొలగించేంతవరకు తాము ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.
Advertisement