ఆప్‌ను ఎదుర్కోవడమే లక్ష్యం | BJP targets AAP | Sakshi
Sakshi News home page

ఆప్‌ను ఎదుర్కోవడమే లక్ష్యం

Published Wed, Jan 28 2015 10:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP targets AAP

సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కోవడం కోసం బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీతో పాటు కేంద్ర మంత్రులతో నగరంలో విస్తృతంగా ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహిస్తోంది. కిరణ్ బేడీ బుధవారం నగరంలో ఐదు రోడ్‌షోలు నిర్వహించగా, కేంద్ర మంత్రులు  సుస్మాస్వరాజ్, స్మృతి ఇరానీ చెరో నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా నగరంలో ర్యాలీ నిర్వహించారు. మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వారికి అవగాహన కల్పించారు. న్యూఢిల్లీ ఎంపీ దక్షిణ ఢిల్లీలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షో నిర్వహించారు.
 
 మరోవైపు  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విధానసభ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు ఆయన బుధవారం పార్టీ రాష్ర్ట శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. వార్షిక బడ్జెట్ రూపకల్పనలో జైట్లీ బిజీగా ఉన్నారని, అందువల్ల ఆయన ప్రతి రోజూ కనీసం ఓ గంట సేపు పార్టీ కార్యాలయంలో గడుపుతారని, మీడియాతో కూడా మాట్లాడతారని ఆ పార్టీ నాయకుడొకరు తెలియజేశారు. బూత్‌స్థాయి సమావేశాలు జరపడంతో పాటు కొన్ని నిర్దిష్ట రంగాలపై దృష్టి సారించాలంటూ పార్టీ...జైట్లీని ఆదేశించిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆప్ ఆరోపణలు తిప్పికొట్టే బాధ్యతను కూడా కమలం అధిష్టానం కేంద్ర మంత్రులకు అప్పగించింది. విద్యుత్తు సమస్యలపై ఆప్ ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యతను ఆ  శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు, ఆరోగ్యాంశాలపై ప్రతిస్పందించే బాధ్యతను ఆరోగ్య మంత్రి జేపీనడ్డాకు, ఆర్థిక వ్యవహారాలపై ప్రతిస్పందించే బాధ్యతను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారని అంటున్నారు. విద్యకు సంబంధించిన విషయాలపై స్మృతీఇరాని, మహిళా భద్రత కు సంబంధించిన అంశాలపై కిరణ్ బేడీ సమాధానమిస్తారని అంటున్నారు.
 
 బేడీపై దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన బీజేపీ
 కిరణ్ బేడీని అవకాశవాదిగా చిత్రీకరిస్తూ ఆప్ జరుపుతున్న ప్రచారాన్ని కూడా బీజేపీ తిప్పికొట్టింది. కేజ్రీవాల్ పెద్దఅవకాశవాది అని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆప్‌ను వీడి ఇటీవల కమలం తీర్థం పుచ్చుకున్న షాజియా ఇల్మీ కూడా కేజ్రీవాల్‌తో పాటు ఆశుతోష్‌ను అవకాశవాదిగా పేర్కొన్నారు. తాను బీజేపీపట్ల మొదటి నుంచి మెతకగా ఉన్నానని, తన వైఖరి మొదటినుంచి అనుమానాస్పదంగానే ఉందని ఆప్ నేతలు ఇప్పుడు ఆరోపిస్తున్నారని, అటువంటప్పుడు తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఎందుకొచ్చిందని కిరణ్ బేడీ ప్రశ్నించారు. అన్నా ఆందోళన సమయంలో కిరణ్ బేడీ... బీజేపీ నేతల పట్ల  మెతకగా వ్యవహరించారని, నితిన్ గడ్కరీ నివాసం వద్ద ధర్నాలో పాల్గొనడానికి రాలేదంటూ ఆప్ చేసిన ఆరోపణలపై ఆమె పైవిధంగా ప్రతిస్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement