Delhi assembly polls 2015
-
ఆప్‌ను ఎదుర్కోవడమే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కోవడం కోసం బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీతో పాటు కేంద్ర మంత్రులతో నగరంలో విస్తృతంగా ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహిస్తోంది. కిరణ్ బేడీ బుధవారం నగరంలో ఐదు రోడ్‌షోలు నిర్వహించగా, కేంద్ర మంత్రులు సుస్మాస్వరాజ్, స్మృతి ఇరానీ చెరో నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా నగరంలో ర్యాలీ నిర్వహించారు. మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వారికి అవగాహన కల్పించారు. న్యూఢిల్లీ ఎంపీ దక్షిణ ఢిల్లీలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షో నిర్వహించారు. మరోవైపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విధానసభ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు ఆయన బుధవారం పార్టీ రాష్ర్ట శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. వార్షిక బడ్జెట్ రూపకల్పనలో జైట్లీ బిజీగా ఉన్నారని, అందువల్ల ఆయన ప్రతి రోజూ కనీసం ఓ గంట సేపు పార్టీ కార్యాలయంలో గడుపుతారని, మీడియాతో కూడా మాట్లాడతారని ఆ పార్టీ నాయకుడొకరు తెలియజేశారు. బూత్‌స్థాయి సమావేశాలు జరపడంతో పాటు కొన్ని నిర్దిష్ట రంగాలపై దృష్టి సారించాలంటూ పార్టీ...జైట్లీని ఆదేశించిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆప్ ఆరోపణలు తిప్పికొట్టే బాధ్యతను కూడా కమలం అధిష్టానం కేంద్ర మంత్రులకు అప్పగించింది. విద్యుత్తు సమస్యలపై ఆప్ ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యతను ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు, ఆరోగ్యాంశాలపై ప్రతిస్పందించే బాధ్యతను ఆరోగ్య మంత్రి జేపీనడ్డాకు, ఆర్థిక వ్యవహారాలపై ప్రతిస్పందించే బాధ్యతను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారని అంటున్నారు. విద్యకు సంబంధించిన విషయాలపై స్మృతీఇరాని, మహిళా భద్రత కు సంబంధించిన అంశాలపై కిరణ్ బేడీ సమాధానమిస్తారని అంటున్నారు. బేడీపై దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన బీజేపీ కిరణ్ బేడీని అవకాశవాదిగా చిత్రీకరిస్తూ ఆప్ జరుపుతున్న ప్రచారాన్ని కూడా బీజేపీ తిప్పికొట్టింది. కేజ్రీవాల్ పెద్దఅవకాశవాది అని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆప్‌ను వీడి ఇటీవల కమలం తీర్థం పుచ్చుకున్న షాజియా ఇల్మీ కూడా కేజ్రీవాల్‌తో పాటు ఆశుతోష్‌ను అవకాశవాదిగా పేర్కొన్నారు. తాను బీజేపీపట్ల మొదటి నుంచి మెతకగా ఉన్నానని, తన వైఖరి మొదటినుంచి అనుమానాస్పదంగానే ఉందని ఆప్ నేతలు ఇప్పుడు ఆరోపిస్తున్నారని, అటువంటప్పుడు తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఎందుకొచ్చిందని కిరణ్ బేడీ ప్రశ్నించారు. అన్నా ఆందోళన సమయంలో కిరణ్ బేడీ... బీజేపీ నేతల పట్ల మెతకగా వ్యవహరించారని, నితిన్ గడ్కరీ నివాసం వద్ద ధర్నాలో పాల్గొనడానికి రాలేదంటూ ఆప్ చేసిన ఆరోపణలపై ఆమె పైవిధంగా ప్రతిస్పందించారు. -
ఆసక్తికరంగా మారిన ‘కృష్ణనగర్’ పోరు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ బరిలోకి దిగడంతో కృష్ణనగర్ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి అప్పటి బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేశారు. హర్షవర్ధన్ ఈ నియోజకవర్గానికి చిరపరిచితుడు కాగా కిరణ్ బేడీ పూర్తిగా కొత్త. మాజీ పోలీసు అధికారిణి వ్యక్తిత్వం, పనితీరు ఇక్కడివారికి సుపరిచితమే. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బేడీ విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఆటోవాలాలు, టీవాలాలు, చిన్నారులు, యువత, మహిళలతో ముచ్చటిస్తూ అందరినీ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కమలానికి కంచుకోటగా ముద్రపడిన నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణనగర్ నుంచి కిరణ్‌బేడీ గెలుపొందే అవకాశముంది. అయితే ప్రత్యర్థులు మాత్రం ఆమెను ఎలాగైనా ఓడించాలని తహతహలాడుతున్నారు. ఇక్కడినుంచి ఈసారి పోటీచేస్తున్న అభ్య ర్థులంతా పంజాబీలే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి బన్సీలాల్‌ను బరిలోకి దింపింది. లాల్... ఇక్కడివారికి సుపరిచితుడే. ఈ నియోజకవర్గం పరిధిలోని గీతాకాలనీ మున్సిపల్ వార్డు నుంచి ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మూడోసారి ఈ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో ఆయన తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయారు. 2012 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ....లాల్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థికి ధరావత్తు కూడా దక్కకుండా చేశారు. ఈ నేపథ్యంలో లాల్... కిరణ్ బేడీకి కొంతమేర పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి ఎస్.కె.బగ్గాకు టికెట్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి బయటి వ్యక్తే అయినప్పటికీ ఆయనకు గణనీయంగానే ఓట్లుపడ్డాయని, ఈసారి ఆప్ అభ్యర్థి స్థానికుడైనందువల్ల ఓట్ల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు. -
పాలనా అనుభవం కలిగిన సీఎం అవసరం
న్యూఢిల్లీ: నగర మహిళకు భద్రతా భావం కలగాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు. తమ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీకి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చేయాల్సిన పనులకు సంబంధించి తమ పార్టీ అనేక ప్రణాళికలను రూపొందించిందన్నారు. ‘నగరంలో నివసిస్తున్న మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకోవాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరం. మహిళా భద్రతకు సంబంధించి మా వద్ద అనేక ప్రణాళికలు సిద ్ధంగా ఉన్నాయి. అయితే అధికారంలోకి వస్తే మాత్రమే వాటిని అమలు చేయగలుగుతాం’ అని మీనాక్షి పేర్కొన్నారు. విధానసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే మహిళల సౌకర్యం కోసం అనేకం అందుబాటులోకి తీసుకొస్తామని మీనాక్షి చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్, మహిళా ట్యాక్సీలను వంటివి ప్రవేశపెడతామన్నారు.