బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ బరిలోకి దిగడంతో కృష్ణనగర్ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ బరిలోకి దిగడంతో కృష్ణనగర్ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి అప్పటి బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేశారు. హర్షవర్ధన్ ఈ నియోజకవర్గానికి చిరపరిచితుడు కాగా కిరణ్ బేడీ పూర్తిగా కొత్త. మాజీ పోలీసు అధికారిణి వ్యక్తిత్వం, పనితీరు ఇక్కడివారికి సుపరిచితమే. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బేడీ విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఆటోవాలాలు, టీవాలాలు, చిన్నారులు, యువత, మహిళలతో ముచ్చటిస్తూ అందరినీ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కమలానికి కంచుకోటగా ముద్రపడిన నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణనగర్ నుంచి కిరణ్‌బేడీ గెలుపొందే అవకాశముంది. అయితే ప్రత్యర్థులు మాత్రం ఆమెను ఎలాగైనా ఓడించాలని తహతహలాడుతున్నారు.
ఇక్కడినుంచి ఈసారి పోటీచేస్తున్న అభ్య ర్థులంతా పంజాబీలే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి బన్సీలాల్‌ను బరిలోకి దింపింది.
లాల్... ఇక్కడివారికి సుపరిచితుడే. ఈ నియోజకవర్గం పరిధిలోని గీతాకాలనీ మున్సిపల్ వార్డు నుంచి ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మూడోసారి ఈ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో ఆయన తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయారు. 2012 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ....లాల్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థికి ధరావత్తు కూడా దక్కకుండా చేశారు. ఈ నేపథ్యంలో లాల్... కిరణ్ బేడీకి కొంతమేర పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి ఎస్.కె.బగ్గాకు టికెట్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి బయటి వ్యక్తే అయినప్పటికీ ఆయనకు గణనీయంగానే ఓట్లుపడ్డాయని, ఈసారి ఆప్ అభ్యర్థి స్థానికుడైనందువల్ల ఓట్ల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు.