పరిషత్ నుంచి బీజేపీ వాకౌట్
బెంగళూరు: లోకాయుక్తపై వచ్చిన ఆరోపణల విషయమై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలనే విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు పరిషత్ నుంచి గురువారం వాకౌట్ చేశారు. వివరాలు...పరిషత్‌లో కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే బీజేపీ నాయకులు లోకాయుక్తపై వచ్చిన ఆరోపణల విషయమై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న పరిషత్ అధ్యక్షుడు శంకరమూర్తి ‘ఈ విషయమై ఇప్పటికే శాసనసభలో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సమాధానం ఇచ్చారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత మాత్రమే ఏ విషయానైనా చర్చించడం సంప్రదాయం. స్థానిక సమస్యలపై చర్చలు జరపడం కోసమే బెళగావిలో శాసనసభ సమావేశాలు జరుపుతున్నాం. ఈ కారణాల వల్ల నేను లోకాయుక్తపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం పరిషత్‌లో చర్చ జరపడానికి ప్రస్తుతం అనుమతించడం లేదు.’ అని స్పష్టం చేశారు. అయినా కూడా విషయ గంభీరత దృష్ట్యా చర్చకు అనుమతించాల్సిందేనని కే.ఎస్ ఈశ్వరప్ప పట్టుబట్టారు. ఈ సమయంలో ఎస్.ఆర్ పాటిల్ కలుగజేసుకుని ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నందు వల్ల ఇక చర్చ సరికాదని పరిషత్‌కు తెలియజేశారు. అంతేకాక ఆరోపణలపై దర్యాప్తునకు ప్రత్యేక తనిఖీ బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం-సిట్) ఏర్పాటు చేసినందువల్ల సీబీఐకు అప్పగించడం కూడా సరికాదన్నారు. అయినా కూడా బీజేపీ నాయకులు చర్చ ప్రారంభించడానికి తయారయ్యారు. దీంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ విపక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రజాస్వామ్యంలో చర్చల వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అందువల్ల వాకౌట్ చేయడం సరికాదని సీఎం సిద్ధరామయ్య చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సిద్ధరామయ్య మాటలను పట్టించుకోకుండా బీజేపీ నాయకులు పరిషత్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
సంతకాల సేకరణకు పూనుకున్న విపక్షాలు...
ఇదిలా ఉండగా శాసనసభలో బీజేపీ, జేడీఎస్ ఫ్లోర్‌లీడర్లయిన జగదీష్‌శెట్టర్, కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ‘లోకాయుక్త భాస్కర్‌రావును ఆ స్థానం నుంచి తొలగించడానికి ప్రభుత్వానికి అధికారాలతో పాటు అనేక అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు ఎవరి పైన ఆరోపణలు వచ్చాయో (లోకాయుక్త భాస్కర్‌రావు) అతని నుంచే సలహాలు తీసుకుని ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే ఈ అక్రమాల్లో ప్రభుత్వంలోని పలువురు నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇక విపక్షాలుగా మా బాధ్యతను నిర్వహించాలి. అందుకోసం లోకాయుక్త భాస్కర్‌రావును తొలిగించే విషయమై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించి లిఖిత పూర్వకంగా స్పీకర్‌కు అందజేయనున్నాం. మనఃసాక్షిని అనుసరించి సంతకాలు చేయమని కాంగ్రెస్ పార్టీకు చెందిన వారిని కూడా కోరుతాం’ అని వివరించారు. నేటి (శుక్రవారం) సాయంత్రం లేదా సోమవారం స్పీకర్‌కు సంతకాల సేకరణ ప్రతిని అందజేస్తాం అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు వారు సమాధానమిచ్చారు.