విజృంభిస్తున్న డెంగీ
- బాధితులతో కిటకిటలాడుతున్న విమ్స్
- బళ్లారి, రాయచూరు, కొప్పళ వాసులే అధికం
బళ్లారి (తోరణగల్లు) : అప్పుడప్పుడు కురుస్తున్న వానలకు తోడు మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రతల నుంచి దోమలు కుప్పతెప్పలుగా ఉత్పత్తవుతున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉన్న మూతలులేని నీటితొట్టెలు, డ్రమ్ములు, టైర్లు, టెంకల్లో నుంచి డెంగ్యూ బారిన పడేసే దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ దోమకాటుకు గురైనవారు జ్వరంతో మంచాన పడుతున్నారు. ఈ జ్వరమే డెంగీగా మారి ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. విమ్స్‌లో చిల్డ్రన్స్ వార్డులో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతవాసులు, చిన్నారులు చికిత్స పొందుతున్నారు. గత వారం తీవ్ర డెంగీతో మృత్యువాత పడిన మహిళలు, చిన్నారులు ఉన్నారు.
ఆసుపత్రిలో వార్డులు డెంగీ బాధితులతో నిండుతున్నాయి. విమ్స్ పాలక మండలి డెంగీ బాధితుల కోసం కొత్తగా రెండు వార్డులను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న డెంగీ బాధితులతో వార్డుల్లో పడకల కొరత ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, సిటీ కార్పొరేషన్ చర్యలు చేపట్టి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి డెంగీని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.