
పెళ్లి మండపం నుంచి వధూవరులు పరార్
సాక్షి, చెన్నై: కల్యాణ మండపం నుంచి వధూవరులు పరారైన ఘటన తమిళనాడులోని స్వామిమలైలో బుధవారం చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోగల చోళపురానికి చెందిన అళగర్ కుమార్తె దుర్గాదేవి(27), కోవిలాచ్చేరికి చెందిన ఆటో మెకానిక్ బాబురాజన్(33) మూడేళ్ల క్రితం వేలాంగన్నిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత వీరిద్దరూ కోవిలాచ్చేరిలో కాపురం పెట్టారు. ప్రస్తుతం దుర్గాదేవి నాలుగు నెలల గర్భిణి.
అయితే తల్లిదండ్రులు చూసిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు బాబురాజన్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి కుంభకోణం మహిళా పోలీసుస్టేషన్‌లో దుర్గాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాబురాజన్‌ను పిలిచి మాట్లాడారు. కాగా, తన వివాహానికి పోలీసులు అడ్డుపడుతున్నారని అతడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడగా కోర్టు తోసిపుచ్చింది.
మరోవైపు స్వామిమల ఆలయంలో బుధవారం బాబురాజన్‌కు, వలంగమాన్ సమీపంలోగల విసలూరుకు చెందిన యువతితో బుధవారం వివాహం జరిపేందుకు ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలిసి దుర్గాదేవి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో దుర్గాదేవి న్యాయవాదిని తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దీంతో స్పందించిన కుంభకోణం తాలూకా పోలీసులు స్వామిమలై ఆలయానికి వెళ్లి బాబురాజన్ పెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసి మండపంలో ఉన్న బాబురాజన్, పెళ్లికుమార్తె.. ఆమె బంధువులు అక్కడ నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.