‘బెస్ట్’ భారం!
Published Thu, Aug 29 2013 11:04 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
సాక్షి,ముంబై: బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై మరోసారి చార్జీల భారం మోపేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ప్రతీరోజు దాదాపు 45 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నప్పటికీ బెస్ట్ సంస్థ కిలోమీటరుకు రూ.14 నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇంధనం ధరలు పెంచితే చార్జీలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని బెస్ట్ సమితి అధ్యక్షుడు సంజయ్ అంబోలే సంకేతాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి నాలుగైదు సార్లు ఇంధనం ధర పెంచుతోంది.
కాని ధరలు పెంచిన ప్రతీసారి బెస్ట్ పరిపాలన విభాగం చార్జీలు పెంచడం లేదు. ఇప్పటికే విడిభాగాల ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో సంస్థపై అదనపు భారం పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇంధనం ధరలు పెరిగితే చార్జీలు పెంచడం తప్పనిసరని అంబోలే పేర్కొన్నారు. బెస్ట్ ఆధీనంలో మొత్తం 4,200 బస్సులున్నాయి. ఇందులో 1,200 బస్సులు డీజిల్ ద్వారా నడుస్తాయి. మిగతావి కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) తో నడుస్తున్నాయి. ఇంధనం ధరలు తరుచూ పెరుగుతుండడంతో హోల్‌సేల్‌లో కొనుగోలు చేసే సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో బెస్ట్ ఈ ఏడు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి బయట పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేయడం ప్రారంభించింది.
అయినప్పటికీ బెస్ట్‌కు ఏటా రూ.60 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బెస్ట్‌ను గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు బెస్ట్ సమితి సమావేశం నిర్వహించింది. ఇందులో వెంటనే ఓ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన చార్జీలవల్ల ప్రయాణికులు బెస్ట్ బస్సులవైపు మొగ్గుచూపడం లేదు. దగ్గరి ప్రయాణానికి ఇద్దరు లేదా ముగ్గురుంటే చాలు అత్యధిక శాతం ట్యాక్సీలు లేదా ఆటోల్లోనే వెళుతున్నారు. దీంతో కలెక్షన్లు లేక బెస్ట్ ఆర్థిక పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇంధనం కొనుగోలులో బెస్ట్‌కు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖల ద్వారా డిమాండ్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై త్వరలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ కానున్నట్లు అంబోలే పేర్కొన్నారు.
Advertisement
Advertisement