బడ్జెట్‌కు 4 వేల సలహాలు | Budget To 4 thousand suggestions | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌కు 4 వేల సలహాలు

Published Thu, Mar 5 2015 2:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

బడ్జెట్‌కు 4 వేల సలహాలు - Sakshi

బడ్జెట్‌కు 4 వేల సలహాలు

ముంబై: మహారాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపొందించేందుకు సలహాలివ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ కోరిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,972 సూచనలు ప్రజల నుంచి వచ్చాయి. ఈ నెల 18న అసెంబ్లీలో సుధీర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, ఉన్నతాధికారులను ఆయన కోరారు.

అలాగే వివిధ రాజకీయ పార్టీలు, విభిన్న రంగాల నిపుణులు, ప్రజలను కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మొదటి సారిగా ఈ-మెయిల్, వాట్స్‌యాప్, ఎస్‌ఎంఎస్, ప్రభుత్వ వెబ్‌సైట్, ఉత్తరాల ద్వారా అనూహ్య స్పందన లభించింది. అందులో ఈ-మెయిల్ ద్వారా 1,226, వాట్సాప్ ద్వారా 1,713, ఎస్సెమ్మెస్ ద్వారా 720, రాష్ట్రాల ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారా 313 సలహాలు, సూచనలు వచ్చాయి.

రెవెన్యూ వసూళ్లు పెంచుకోవడం, మహిళల సాధికారత, వ్యాట్, సౌర విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సాంకతిక శాఖ అభివృద్ధిపై అధిక శాతం మంది సూచించారు. వచ్చిన సలహాలన్నీ పరిశీలించి కొన్నింటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ముంగంటివార్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో సామాన్య ప్రజల ఆశలు, ఆశయాలు ప్రతిబింబించేలా ప్రయత్నించామని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
బీజేపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం: సునీల్
బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మాజీ మిత్రులు కాంగ్రెస్, ఎన్సీపీలు కలవనున్నాయి. ఇందుకోసం ఎన్సీపీ నేత కాంగ్రెస్‌తో చర్చించారు. ముఖ్యంగా కరవు రైతులకు ఆర్థిక సాయం జాప్యం పైనే ప్రతిపక్షాలు విమర్శల బాణాలు సంధించడానికి రెడీ అయ్యాయి. ‘రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌తో మాట్లాడాను. బడ్జెట్ సమావేశాలు మొదలవ్వక ముందే ఒక సారి వివిధ అంశాలపై చర్చించాలని వారు కోరారు. మేం అందుకు సానుకూలంగానే ఉన్నాం.

ప్రజా సంక్షేమం ముఖ్యమైనది. ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. సమావేశాలు ప్రారంభం కాకముందే ఇరు పార్టీలు అసెంబ్లీ వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తాం’ అని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ ఠాక్రే తెలిపారు. మార్చి 18న బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కరవు రైతులకు ఆర్థిక సాయం చేయకుండా ప్రభుత్వం వారు అత్మహత్యలు చేసుకుంటూంటే కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందని ఆయన విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం రూ. 7 వేల కోట్ల పాకేజీని ప్రకటించిందని , అయితే అది ఇప్పటికే విడుదల చేయలేదని ఆయన దుయ్యబట్టారు. గత వరం వచ్చిన అకాల వర్షాలకు సుమారు 7.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగితే.. రైతులకు సహాయం చేయడానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందుకు రాలేదని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ అసెంబ్లీలో లేవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు. శివసే అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముంబై అభివృద్ధి ప్రణాళిక చెత్తబుట్టలో వేసినా పనికిరాదని ఆయన నిప్పులు చెరిగారు
 
బడ్జెట్‌లో రైతులకు నష్టపరిహారం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటల వివరాల సేకరణను ఈ నెల 15 లోపు పూర్తిచేయాలని, బడ్జెట్‌లో రైతులకు నష్టపరిహారాన్ని ప్రకటించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతుల నష్టాలపై చర్చించారు. సాధ్యమైనంత త్వరగా వివరాల సేకరణ పూర్తిచేసి వెంటనే నివేదిక అందజేయాలని సంబంధిత కమిషనర్లను, అధికారులను సీఎం ఆదేశించారు.

గత శని, ఆదివారాలు చల్లని ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షాల ద్రాక్ష, మామిడి, సోయాబీన్, శనగ, జీడిపప్పు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క యావత్మాల్ జిల్లాలోనే 15 వేల హెక్టార్ల పంటలకు నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలో నష్టం ఎక్కువే ఉంటుందని అంచనా వేశారు. ఈనెల 9న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవ్వనుండగా, 18 న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో రైతులకు అందజేసే నష్టపరిహారంపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement