స్థానిక పార్టీలకు ఈసీ షాక్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఎంఐఎంతో సహా 191 స్థానిక పార్టీల రిజస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆదాయ పన్ను రిటర్నులు, తనిఖీ చేసిన ఖాతాల వివరాలు సమర్పించకపోవడమే కారణమని తెలిపింది. వేటు పడిన పార్టీల్లో ఆర్‌పీఐ-కోబ్రాగడే ఫ్యాక్షన్, తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సత్తా, యూపీకి చెందిన పీస్ పార్టీలున్నాయి.
ప్రస్తుతం 359 పార్టీలు కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. వీటిలో 17 గుర్తింపు పొందినవి ఉన్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించని 326 పార్టీలకు నోటీసులు పంపామని కమిషనర్ జేఎస్ సహారియా చెప్పారు. గడువు పొడిగించినా, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఈ 191 పార్టీల నుంచి స్పందన రాలేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలనుకునే పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి.
ముంబై మహానగర ఎన్నికలు, ఇతర స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న ఎంఐఎంకు ఈ పరిణామం ఎదురు దెబ్బే. ఎన్నికల నియమావళిని అనుసరించి కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవమేనని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.