‘ముల్లై’ కమిటీ
సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం పర్యవేక్షణా కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఆ డ్యాంలోకి 142 అడుగుల మేరకు నీటి మట్టం చేరుతుందా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని సర్వత్రా స్వాగతించారు. పీఎం మోడీకి సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలియజేశారు. నీటి కోసం అటు కర్ణాటక, ఇటు కేరళతో తమిళనాడు పెద్ద సమరమే చేస్తూ వస్తోం ది. కావేరి వివాదం కర్ణాటకతో సాగుతోంటే, ముల్లై పెరియార్ డ్యాం వివా దం కేరళతో ఎదుర్కోవాల్సిన పరి స్థితి. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కులు తమిళనాడుకే ఉన్నాయి. అయితే, ఈ హక్కులను కాలరాసే రీతిలో కేరళ సర్కారు తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నది. దీంతో ఈ నీటిపై ఆధార పడ్డ తేని, రామనాధపురం, శివగంగై, దిండుగల్, మదురై జిల్లాల్లో తరచూ ఆందోళనలు జరగడం సాధారణమైపోయింది.
అన్నదాతలు ఓ వైపు, తమిళనాడు ప్రభుత్వం మరో వైపు కేరళతో తరచూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కోర్టుల్లో ఏళ్ల తరబడి విచారణలు సాగాయి. ఎట్టకేలకు గత నెల విచారణ ముగింపు దశకు చేరింది. ఆ డ్యాంను పరిశీలించి సమగ్ర నివేదికను సుప్రీం కోర్టు కమిటీ సిద్ధం చేసింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ముల్లై పెరియార్ డ్యాం పటిష్టంగా ఉందని, ఆ డ్యాం నీటి మట్టాన్ని 142 అడుగుల వరకు నిల్వ ఉంచుకోవచ్చంటూ తీర్పు వెలువరించింది. ఇది తమిళులు సాధించిన విజయం. అదే సమయంలో ఆ డ్యాం పర్యవేక్షణకు కేంద్రం, తమిళనాడు, కేరళ అధికారులతో ప్రత్యేక కమిటీకి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
జాప్యం...అడ్డంకులు : సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు నీటి పారుదల శాఖ అధికారులు నీటి మట్టం పెంపు పరిశీలన పర్వానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పనులకు అడుగడుగున కేరళ సర్కారు అడ్డు తగులుతూ రావడంతో పనుల్లో జాప్యం నెలకొంది. సుప్రీం కోర్టు ఆదే శాల మేరకు కమిటీ ప్రకటనలోను జాప్యం తప్పలేదు. కేరళ చర్యలను వివరిస్తూ పదే పదే ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలిలత లేఖాస్త్రాల్ని సంధించారు. ఇందుకు ప్రతి ఫలం బుధవారం దక్కింది. కమిటీ : ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముల్లై పెరియార్ డ్యాం పర్యవేక్షణా కమిటీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కమిటీలో తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని కావేరి నదీ జలాల సాంకేతిక కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న సుబ్రమణియన్‌ను ఎంపిక చేశారు.
కేరళ తరపున ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి సూర్యన్‌ను నియమించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తరపున అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అదే సమయంలో త్వరితగతిన కమిటీ అధ్యక్షుడి ప్రకటన చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పుడే కేరళ ఆగడాలకు పూర్తి స్థాయిలో కళ్లెం వేయగలిగే అవకాశాలు ఉంటాయి. ఇది వరకు కేంద్ర నీటి పారుదల శాఖలో పనిచేసిన అధికారులు తద్వా, మోహత, కోషాల పేర్లు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కృతజ్ఞతలు : కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడులో హర్షాతి రేకాలు వెల్లువెత్తాయి.
పధానంగా తేని, దిండుగల్, మదురై, శివగంగై, రామానాథపురం జిల్లాల అన్నదాతలు తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు. 142 అడుగులకు నీటి మట్టం ఎప్పుడెప్పుడు చేరుతుందోనన్న ఎదురు చూపుల్లో అన్నదాతలు ఉన్నారు. కేరళలో కురుస్తున్న వర్షాలతో ముల్లై పెరియార్ డ్యాంకు నీటి రాక పెరుగుతోంది. ఈ దృష్ట్యా త్వరితగతిన కమిటీ అధ్యక్షుడిని నియమించిన పక్షంలో నీటి మట్టం పెంపుకు దోహద కారి అవుతుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముల్లై పెరియార్ డ్యాం భద్రతా కమిటీ అధ్యక్షుడు రంజిత్‌కుమార్ పేర్కొంటూ, కేంద్రం నిర్ణయం ఆనందాన్ని కల్గిస్తున్నదన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.
ముల్లై పెరియార్ డ్యాంపై తమిళులకు పూర్తి హక్కులు ఉన్నాయన్న విషయాన్ని ఇప్పుటికైనా కేరళ సర్కారు గుర్తించి, అడ్డుతగలడం మానుకోవాలని హితవు పలికారు. ఇక, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే అధినేత విజయకాంత్, రాష్ట్ర బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, పీఎంకే అధినేత రాందాసు, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, ఐజేకే నేత పారివేందన్‌లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ పంపించారు. ముల్లై పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు చేసినట్టుగానే, కావేరి బోర్డు, కమిటీ ఏర్పాట్లుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డెల్టా అన్నదాత లు విజ్ఞప్తి చేస్తున్నారు.