సాక్షి, చెన్నై : తమిళనాట కరోనా బారిన పడ్డ మీడియా ప్రతినిధి ఈ.వేల్ మురుగన్ మృత్యుఒడిలోకి చేరడం జర్నలిస్టు వర్గాల్ని ఆందోళనలో పడేసింది. నిత్యం సమాచార సేకరణలో దూసుకెళ్లిన సీనియర్ కెమెరామెన్‌ను కరోనా కబళించడంతో సర్వత్రా దిగ్బ్రాంతికి లోనయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్నది. ప్రధానంగా చెన్నైలో వైరస్ కరాళతాండవానికి తోడు మరణమృదంగం మార్మోగుతోంది. కరోనా నివారణ చర్యలు, అవగాహన, సమాచారాలు, ప్రభుత్వాలు తీసుకునే చర్యలు అంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు చేర వేయడంలో మీడియా పాత్ర కీలకం. (గ్రేటర్‌లోనే 10 వేల కరోనా కేసులు)
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, కరోనా కాలంలోనూ ఏ మాత్రం తగ్గకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాలు చేర వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే, వీరిని సైతం కరోనా వదలి పెట్టలేదు. తొలుత ఓ ఇద్దర్ని, ఆ తర్వాత నలుగుర్ని అంటూ కరోనా వైరస్ దాడి చేయడం మొదలెట్టింది. ఓ ప్రముఖ తమిళ పత్రికలో అయితే, పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడక తప్పలేదు. ఇందులో ఓ నాన్ జర్నలిస్టు మరణించారు. రోజు రోజుకు చెన్నైలో కరోనా కేసులు పెరిగే కొద్ది జనంలో భయం అన్నది పెరిగి ఉన్న నేపథ్యంలో వారిలో భరోసా, ధైర్యాన్ని , అవగాహనను నింపే కథనాలు, వార్త సమాచారాలతో ముందుకు సాగుతున్న జర్నలిస్టు సమాజాన్ని కలవరంలో పడేస్తూ శనివారం ఓ సహచరుడు మృత్యుఒడిలోకి చేరాడు.
నివాళులు...సాయం..
వేల్ మురుగన్ మరణ సమాచారంతో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు సాయాన్ని సీఎం ప్రకటించారు. వేల్‌మురుగన్ కుటుంబానికి సాను భూతి తెలియజేశారు. అలాగే, తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన సంతాపం వ్యక్తం చేశారు. మత్స్య శాఖ మంత్రి జయకుమార్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి తలా రూ. 50 వేలు సాయం ప్రకటించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి తమ సంతాపం తెలియజేశారు. జర్నలిస్టు సంఘాల నేతలు తమసంతాపం తెలియజేస్తూ సాయం అందించేందుకు నిర్ణయించారు. చెన్నై ప్రెస్ క్లబ్ కార్యదర్శి భారతీ తమిళన్ ప్రకటనలో సంతాపం తెలియజేస్తూ, సీఎం ముందు కొన్ని విజ్ఞప్తులను ఉంచారు. విధి నిర్వహణలో జర్మలిస్టులు ఎవరైనా మరణిస్తే నష్ట పరిహారంచెల్లించాలని కోరారు. తాత్కాలిక నర్సుగా సేవల్ని అందిస్తున్న షణ్ముగసుందరికి ఉద్యో గం పర్మినెంట్ చేయాలని విన్నవించారు. జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారని వీరికి వైద్య సేవల నిమిత్తం ప్రత్యేక బీమా పథకం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు విధులు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని మరచి పోవద్దు అని భారతీతమిళన్ కోరారు.
41 ఏళ్లకే నూరేళ్లు నిండాయి..
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన రెండు వందల మందికి పైగా కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో, క్వారంటైన్లలో, హోం క్వారంటైన్లలో ఉన్నారు. ఇందులో ఓ తమిళ న్యూస్ చానల్‌కు చెందిన సీనియర్ కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఈ.వేల్ మురుగన్(41) కూడా ఉన్నారు. చెన్నై రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన వేల్‌మురుగన్ పరిస్థితి క్రమంగా క్షీణించింది. శనివారం ఉదయాన్నే వేల్ మురుగన్ మరణించినట్టుగా వచ్చిన సమాచారం తమిళనాట ఉన్న ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్ని కలవరంలో పడేసింది. తొలి మరణం నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన తప్పలేదు. వేల్ మురుగన్ మరణాన్ని జీర్ణించుకోలేక, దిగ్భ్రాంతికి లోనైన వాళ్లు ఎందరో. సీనియర్ కెమెరామెన్‌గా 20 ఏళ్లుగా పలు సంస్థల్లో పనిచేసిన వేల్‌మురుగన్‌కు భార్య షణ్ముగ సుందరి, కుమారుడు జీవా(12) ఉన్నారు. షణ్ముగసుందరి కరోనా సేవల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు నర్సుగా విధుల్లో ఉన్నారు. తాను సేవల్ని అందిస్తున్న ఆస్పత్రిలోనే తన భర్త మరణించడంతో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment