Cameraman died
-
సినిమాటోగ్రాఫర్‌ను కాల్చి చంపింది ఆ అగ్రహీరోనే!
న్యూయార్క్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సంచలన నివేదికతో హాలీవుడ్ అగ్రహీరోకు షాక్ ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మృతిలో ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్విన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని ఎఫ్‌బీఐ దాదాపుగా నిర్ధారించేసింది. ప్రాప్ గన్ వర్కింగ్ కండిషన్లోనే ఉందని, నటుడి ప్రమేయం లేకుండా అది పేలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. ప్రముఖ నటుడు(అమెరికన్) అలెక్ బాల్డ్విన్(64) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కిందటి ఏడాది అక్టోబర్‌లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. తొలుత ఈ ఘటనపై బాల్డ్విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు, ఆపై ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. ఈలోపు తుపాకీట్రిగ్గర్ను తాను నొక్కనేలేదని, ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదని, ఘటనకు వేరేవరైనా కారణం అయ్యి ఉండొచ్చని చెబుతూ వస్తున్నాడు అలెక్. ఈ తరుణంలో ఎఫ్‌బీఐ తాను రూపొందించిన నివేదికను బయటపెట్టింది. ఫోరెన్సిక్ నివేదికలో.. అలెక్ బాల్డ్విన్ ప్రమేయం లేకుండా ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకుపోయే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఘటనకు వేరెవరో బాధ్యులన్న బాల్డ్విన్ ఆరోపణలు నిజం కాదని తేలింది. ఇక బాల్డ్విన్ లాయర్, ఎఫ్‌బీఐ నివేదికను తప్పుబడుతున్నాడు. తుపాకీ కండిషన్ ఏమాత్రం బాగోలేదని అంటున్నాడు. ఎఫ్‌బీఐ మాత్రం ఆయుధాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నివేదిక రూపొందించినట్లు చెబుతోంది. ఇక శాంటా ఫే కౌంటీ పోలీసులు ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతుందని, ఇదొక ప్రమాద ఘటనగా మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని ప్రకటించారు. న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్లో కిందటి ఏడాది రస్ట్ సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) అక్కడికక్కడే కన్నుమూసింది. హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్. కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్‌లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్‌లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ 2020లో రిలీజ్ అయ్యింది కూడా. ఇదీ చదవండి: సామాన్యుడిలా ఆ యువరాజు! ఏం చేశాడంటే.. -
కెమెరామ్యాన్ జయరాం కన్నుమూత
‘మేజర్ చంద్రకాంత్, పెళ్లిసందడి’ తదితర చిత్రాల ఛాయాగ్రాహకుడు వెంగల జయరాం (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. జయరాం స్వస్థలం వరంగల్. దివంగత ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. 1960లో ‘ఇల్లరికం’ సినిమాను దాదాపు 15 సార్లు చూశారట.. అప్పుడే ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. టైటిల్స్‌లో ఛాయాగ్రాహకుడు విన్సెంట్ సుందరం పేరు చదివేవారు. ఆ తర్వాతి కాలంలో ఆయనకు శిష్యుడు అయ్యారు జయరాం. సినిమా ఇండస్ట్రీలో ఏదో చేయాలనే లక్ష్యంతో 13 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా పారిపోయి చెన్నై చేరారు. అక్కడ దర్శకుడు గుత్తా రామినీడు సిఫారసుతో ఆంధ్రా క్లబ్లో ఓ చిన్న ఉద్యోగం వచ్చింది. జయరాం ఫ్రెండ్ వి. అంకిరెడ్డి ఎడిటర్. జయరాంలోని ఆసక్తి గమనించిన రామినీడు ‘పగలు నీ జాబ్ చేసుకో.. రాత్రి ఈ వర్క్ నేర్చుకో’ అన్నారు. ఆంధ్రా క్లబ్లో క్యాషియర్ స్థాయికి ఎదిగారు జయరాం. ఆ తర్వాత అవుట్ డోర్ యూనిట్ నుంచి కెమెరా అసిస్టెంట్, ఆ తర్వాత కెమెరామ్యాన్ స్థాయికి ఎదిగారాయన. కెమెరామేన్‌గా ఆయన మొదటి సినిమా చిరంజీవి హీరోగా నటించిన ‘చిరంజీవి’. ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘1921’ అనే మలయాళ సినిమా జయరాంకు అవార్డును తెచ్చిపెట్టింది. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో ‘మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు’, ఏయన్నార్, కృష్ణ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ తదితర హీరోల చిత్రాలకు చేశారు. మోహన్‌బాబు సొంత బ్యానర్లో నిర్మించిన ఎన్నో చిత్రాలకు పనిచేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీల్లో పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మృతి పట్ల తెలంగాణ ఫిలిం సొసైటీ ఫౌండర్ సెక్రటరీ డా. కొణతం కృష్ణ, కార్యవర్గ సభ్యులు రవి, రమేష్ వరంగల్‌లో నివాసం ఉంటున్న జయరాం సోదరిని కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
తమిళనాట మీడియాలో తొలి మరణం
సాక్షి, చెన్నై : తమిళనాట కరోనా బారిన పడ్డ మీడియా ప్రతినిధి ఈ.వేల్ మురుగన్ మృత్యుఒడిలోకి చేరడం జర్నలిస్టు వర్గాల్ని ఆందోళనలో పడేసింది. నిత్యం సమాచార సేకరణలో దూసుకెళ్లిన సీనియర్ కెమెరామెన్‌ను కరోనా కబళించడంతో సర్వత్రా దిగ్బ్రాంతికి లోనయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం ప్రకటించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్నది. ప్రధానంగా చెన్నైలో వైరస్ కరాళతాండవానికి తోడు మరణమృదంగం మార్మోగుతోంది. కరోనా నివారణ చర్యలు, అవగాహన, సమాచారాలు, ప్రభుత్వాలు తీసుకునే చర్యలు అంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు చేర వేయడంలో మీడియా పాత్ర కీలకం. (గ్రేటర్‌లోనే 10 వేల కరోనా కేసులు) ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, కరోనా కాలంలోనూ ఏ మాత్రం తగ్గకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాలు చేర వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే, వీరిని సైతం కరోనా వదలి పెట్టలేదు. తొలుత ఓ ఇద్దర్ని, ఆ తర్వాత నలుగుర్ని అంటూ కరోనా వైరస్ దాడి చేయడం మొదలెట్టింది. ఓ ప్రముఖ తమిళ పత్రికలో అయితే, పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడక తప్పలేదు. ఇందులో ఓ నాన్ జర్నలిస్టు మరణించారు. రోజు రోజుకు చెన్నైలో కరోనా కేసులు పెరిగే కొద్ది జనంలో భయం అన్నది పెరిగి ఉన్న నేపథ్యంలో వారిలో భరోసా, ధైర్యాన్ని , అవగాహనను నింపే కథనాలు, వార్త సమాచారాలతో ముందుకు సాగుతున్న జర్నలిస్టు సమాజాన్ని కలవరంలో పడేస్తూ శనివారం ఓ సహచరుడు మృత్యుఒడిలోకి చేరాడు. నివాళులు...సాయం.. వేల్ మురుగన్ మరణ సమాచారంతో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు సాయాన్ని సీఎం ప్రకటించారు. వేల్మురుగన్ కుటుంబానికి సాను భూతి తెలియజేశారు. అలాగే, తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన సంతాపం వ్యక్తం చేశారు. మత్స్య శాఖ మంత్రి జయకుమార్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి తలా రూ. 50 వేలు సాయం ప్రకటించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి తమ సంతాపం తెలియజేశారు. జర్నలిస్టు సంఘాల నేతలు తమసంతాపం తెలియజేస్తూ సాయం అందించేందుకు నిర్ణయించారు. చెన్నై ప్రెస్ క్లబ్ కార్యదర్శి భారతీ తమిళన్ ప్రకటనలో సంతాపం తెలియజేస్తూ, సీఎం ముందు కొన్ని విజ్ఞప్తులను ఉంచారు. విధి నిర్వహణలో జర్మలిస్టులు ఎవరైనా మరణిస్తే నష్ట పరిహారంచెల్లించాలని కోరారు. తాత్కాలిక నర్సుగా సేవల్ని అందిస్తున్న షణ్ముగసుందరికి ఉద్యో గం పర్మినెంట్ చేయాలని విన్నవించారు. జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారని వీరికి వైద్య సేవల నిమిత్తం ప్రత్యేక బీమా పథకం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు విధులు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని మరచి పోవద్దు అని భారతీతమిళన్ కోరారు. 41 ఏళ్లకే నూరేళ్లు నిండాయి.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన రెండు వందల మందికి పైగా కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో, క్వారంటైన్లలో, హోం క్వారంటైన్లలో ఉన్నారు. ఇందులో ఓ తమిళ న్యూస్ చానల్‌కు చెందిన సీనియర్ కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఈ.వేల్ మురుగన్(41) కూడా ఉన్నారు. చెన్నై రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన వేల్మురుగన్ పరిస్థితి క్రమంగా క్షీణించింది. శనివారం ఉదయాన్నే వేల్ మురుగన్ మరణించినట్టుగా వచ్చిన సమాచారం తమిళనాట ఉన్న ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్ని కలవరంలో పడేసింది. తొలి మరణం నమోదు కావడంతో సర్వత్రా ఆందోళన తప్పలేదు. వేల్ మురుగన్ మరణాన్ని జీర్ణించుకోలేక, దిగ్భ్రాంతికి లోనైన వాళ్లు ఎందరో. సీనియర్ కెమెరామెన్‌గా 20 ఏళ్లుగా పలు సంస్థల్లో పనిచేసిన వేల్‌మురుగన్‌కు భార్య షణ్ముగ సుందరి, కుమారుడు జీవా(12) ఉన్నారు. షణ్ముగసుందరి కరోనా సేవల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు నర్సుగా విధుల్లో ఉన్నారు. తాను సేవల్ని అందిస్తున్న ఆస్పత్రిలోనే తన భర్త మరణించడంతో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. -
మావోయిస్టు దాడిలో జర్నలిస్టు దుర్మరణం
చత్తీస్గడ్: మావోయిస్టుల దాడిలో ఒక వీడియో జర్నలిస్టు దుర్మరణం పాలయ్యారు. దంతేవాడ జిల్లాలో మంగళవారం జరిగిన నక్సల్స్‌దాడిలో ప్రభుత్వరంగ మీడియాసంస్థ దూరదర్శన్‌కు చెందిన కెమెరామ్యాన్ దుర్మరణం చెందారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన దూరదర్శన్ బృందం, పోలీసులపై దంతెవాడలోని అరన్పూర్ అడవుల సమీపంలో ఈదాడి జరిగింది. ఈ ఘటనపై నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందర్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. చనిపోయిన మీడియా పర్సన్‌ను దూరదర్శన్ వీడియో జర్నలిస్టు అచ్యుతానందన్ సాహుగా గుర్తించామన్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్రు పోలీసులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించామని డీఐజీ మీడియాకు వెల్లడించారు. పెట్రోలింగ్‌కు వెళ్లిన సందర్భంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. Dantewada Naxal attack: Two security personnel who were injured brought to hospital. Two security personnel and a DD cameraman lost their lives in the attack. #Chhattisgarh pic.twitter.com/ZiqbwiNbNs — ANI (@ANI) October 30, 2018 -
సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ కన్నుమూత
సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ (స్టడీ క్యామ్ ప్రసాద్) హైదరాబాద్‌లో మరణించారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, చిరునవ్వు తదితర చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేశారు. ప్రసాద్ మృతదేహన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేటకు తరలించారు.