న్యూయార్క్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సంచలన నివేదికతో హాలీవుడ్ అగ్రహీరోకు షాక్ ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మృతిలో ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్‌విన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని ఎఫ్‌బీఐ దాదాపుగా నిర్ధారించేసింది. ప్రాప్ గన్ వర్కింగ్ కండిషన్‌లోనే ఉందని, నటుడి ప్రమేయం లేకుండా అది పేలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది.
ప్రముఖ నటుడు(అమెరికన్) అలెక్ బాల్డ్‌విన్(64) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కిందటి ఏడాది అక్టోబర్‌లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. తొలుత ఈ ఘటనపై బాల్డ్విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు, ఆపై ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. ఈలోపు తుపాకీట్రిగ్గర్‌ను తాను నొక్కనేలేదని, ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదని, ఘటనకు వేరేవరైనా కారణం అయ్యి ఉండొచ్చని చెబుతూ వస్తున్నాడు అలెక్.
ఈ తరుణంలో ఎఫ్‌బీఐ తాను రూపొందించిన నివేదికను బయటపెట్టింది. ఫోరెన్సిక్ నివేదికలో.. అలెక్ బాల్డ్‌విన్ ప్రమేయం లేకుండా ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకుపోయే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఘటనకు వేరెవరో బాధ్యులన్న బాల్డ్‌విన్ ఆరోపణలు నిజం కాదని తేలింది. ఇక బాల్డ్‌విన్ లాయర్, ఎఫ్‌బీఐ నివేదికను తప్పుబడుతున్నాడు. తుపాకీ కండిషన్ ఏమాత్రం బాగోలేదని అంటున్నాడు. ఎఫ్‌బీఐ మాత్రం ఆయుధాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నివేదిక రూపొందించినట్లు చెబుతోంది. ఇక శాంటా ఫే కౌంటీ పోలీసులు ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతుందని, ఇదొక ప్రమాద ఘటనగా మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని ప్రకటించారు.
న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్‌లో కిందటి ఏడాది రస్ట్ సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) అక్కడికక్కడే కన్నుమూసింది. హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్. కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్‌లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్‌లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ 2020లో రిలీజ్ అయ్యింది కూడా.
ఇదీ చదవండి: సామాన్యుడిలా ఆ యువరాజు! ఏం చేశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment