
పరేడ్ కూడా సరిగా చేయలేరా?
పోలీసులకు ఇన్‌చార్జి డీఐజీ అకున్ సూచన
బాన్సువాడ/బిచ్కుంద: ఏమిటీ.. మీరు పరేడ్ కూడా సరిగా నిర్వహించలేరా? అంటూ ఇన్‌చార్జి డీఐజీ అకున్ సబర్వాల్ పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. మంగళ వారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద సర్కిల్ కార్యాలయాలను సందర్శించి, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాన్సువాడలో పరేడ్ చేసిన సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సిబ్బంది అధిక బరువు కారణంగా సరిగా పరేడ్‌లో పాల్గొనలేకపోయారన్నారు.
వారికి సరిగ్గా శిక్షణ కూడా ఇవ్వలేదని, నిర్లక్ష్యంగా పరేడ్ నిర్వహించడం సరికాదని సీఐ వెంకటరమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బిచ్కుందలో ప్రజాప్రతినిధులతో ఇన్‌చార్జి డీఐజీ సమావేశమయ్యారు. లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయా, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నారా, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారా? అని ప్రశ్నించారు.