సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రమాదం ముంచుకొచ్చి బాధితులుగా మిగలక ముందే కాల్‌టాక్సీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీస్‌శాఖ సూచిస్తోంది. కాల్‌టాక్సీ యాజమాన్యాలు కొన్ని కట్టుబాట్లను పాటించకుంటే కటకటాలు తప్పవని హెచ్చరిస్తోంది. చె న్నై నగరవాసులు కాల్‌టాక్సీని వినియోగించడం సహజంగా మారింది. కాల్‌టాక్సీలపై ఆధారపడకుండా రోజు గడవడం అధికశాతం మందికి కష్టంగా మారింది. అందునా మహిళలు పెద్ద సంఖ్యలో కాల్‌టాక్సీని వినియోగిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కాల్‌టాక్సీల డ్రైవర్లు మహిళా ప్యాసింజర్లతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, కిడ్నాప్‌లకు కూడా వెనుకాడక పోవడం పెచ్చుమీరి పోయింది. కాల్‌టాక్సీలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోవడం పోలీస్‌శాఖ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
పారాహుషార్
కాల్‌టాక్సీ వినియోగదారులు, యాజమాన్యాలు సైతం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ పోలీస్‌శాఖ కొత్తగా కొన్ని కట్టుబాట్లను విధించింది. కాల్‌టాక్సీ యాజమాన్యాలు డ్రైవర్, ఇతర విధులకు సిబ్బందిని నియమించే ముందు పోలీస్‌శాఖ నుంచి సచ్చీలురుగా కచ్చితంగా సర్టిఫికెట్ పొందాలి. డ్రైవర్ తాత్కాలిక, శాశ్వత గృహ చిరునామాను సేకరించి పెట్టుకోవాలి. అన్ని వాహనాల్లో జీపీఎస్ పరికరాన్ని అమర్చాలి. ఈ జీపీఎస్ సక్రమంగా పనిచేస్తోందా అని తరచూ తనిఖీలు చేసుకోవాలి.
కాంట్రాక్టుపై వాహనాలు తీసుకునే ముందు వాటి నాణ్యత, యజమాని పేరు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఒప్పందం కుదుర్చుకుని ప్రజా సేవలకు వినియోగించాలి. ప్రయాణికులకు బాగా కనిపించేలే పానిక్ బటన్‌ను అమర్చడంతోపాటూ వాటిని ఎలా వినియోగించాలో తెలియజెప్పాలి. డ్రైవర్లకు ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులను జారీచేయాలి. విధుల్లో ఉన్నపుడు డ్రైవర్లు గుర్తింపు కార్డులను ధరించాలి. ప్రయాణికులు గుర్తింపులేని, నిబంధనలు పాటించని కాల్‌టాక్సీలను వినియోగించరాదు. కాల్‌టాక్సీ యాజమాన్యాలు ప్రతినెలా సమావేశమై డ్రైవర్లు పనితీరును సమీక్షించుకుకోవాలి. ప్రయాణికుల, ముఖ్యంగా మహిళల రక్షణ కోసం విధించిన ఈ నిబంధనలను పాటించని కాల్‌టాక్సీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని పోలీస్‌శాఖ హెచ్చరిస్తోంది.
కాల్‌టాక్సీతో జాగ్రత్త
Published Thu, Sep 29 2016 2:07 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement