రెండు కార్లు ఢీ : ముగ్గురి మృతి
– రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
–నలుగురికి గాయాలు
– ఒకరి పరిస్థితి విషమం
– రాక్‌గార్డెన్ సమీపాన ఘటన
–ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆకె రవికృష్ణ
ఓర్వకల్లు : ఆదివారం సెలవుదినం.. దైవదర్శనానికి వెళ్లిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. తిరుగు ప్రయాణంలో కారు టైరు పేలి..మరో కారును ఢీకొనడంతో భార్యాభర్తలతో పాటు డ్రై వర్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఓర్వకల్లు సమీపంలో చోటు చేసుకొంది. కర్నూలు నగరం గణేశ్ నగర్‌లో నివాసముంటున్న మహేశ్వరరావు (50), భార్య ఉన్నూరమ్మ (45), వీరి బంధువులు బాలాజీనగర్‌కు చెందిన అశోక్‌కుమార్, భార్య సౌమ్య, చిన్న కుమారుడు సన్ని, పార్థులు పాణ్యం మండలంలోని కొత్తూరు సుబ్బరాయుడు (సుబ్రమణేశ్వర స్వామి)ని దర్శించుకునేందుకు వెళ్లాలనుకున్నారు. ఇందుకు ఏపీ 21 జీ 9459 నంబరు గల అద్దె కారును మాట్లాడుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి.. స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. రాక్‌గార్డెన్‌కు పూడిచెర్ల బస్సు స్టేజికి మధ్య వీరు ప్రయాణిస్తున్న కారు ముందు టైరు పగలడంతో అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఏపీ 21 బీసీ 0854 నంబరు గల కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రై వర్ రాంప్రసాద్‌రెడ్డి(45), మహేశ్వరరావు (50), ఉన్నూరమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌కుమార్, ఆయన భార్య సౌమ్య, వీరి కుమారుడు సన్నికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. వీరితో పాటు ఎదుటి వాహనం యజమాని ఎస్‌జే హాస్పిటల్ అధినేత జావిద్ హుసేన్‌కు రెండు కాళ్లు విరిగాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి క్షత్రగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలియగానే జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
మృతుడు పెయింటర్..
మృతుడు మహేశ్వరరావు ఆర్ట్ అండ్ పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగించే వారు. వీరికి అరున్‌రావు, నిరంజన్‌కుమార్ సంతానం ఉన్నారు. గాయపడిన అశోక్‌కుమార్ నగరంలోని బంగారుపేట సమీపంలో గల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నట్లు బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు కేసు నమోదు చేసుకొని మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద మూలంగా అరగంట పాటు రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.