సాక్షి ప్రతినిధి, చెన్నై: అఖిలపక్ష ఆందోళనతో తమిళనాడు దద్దరిల్లింది. కావేరీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అనేక పార్టీల నేతలు కదం తొక్కారు. రైల్‌రోకోలు నిర్వహిం చడం ద్వారా కేంద్రానికి తమ నిరసన గళం వినిపించా రు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, వైగో సహా సుమారు వేలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాల తరబడి కావేరీ జలాల సమస్య నెలకొని ఉంది. సుప్రీంకోర్టులో జరిపిన న్యాయపరమైన పోరాటం ద్వారా కావేరీ జలాల వాటాను తమిళనాడు సాధించుకుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కావేరీ పర్యవేక్షణ కమిటీ, కావేరీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. కమిటీ, బోర్డు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పుతో స్పష్టం చేసినా కేంద్రం అడ్డుకుందని అని ఆరోపిస్తూ ఇటీవల అఖిలపక్షం సమావేశమైంది.
కావేరీ సమస్యల సాధనకు రైతు సంఘాలతో కలిసి ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. ఉత్తరాది నుంచి తమిళనాడుకు చేరుకునే రైళ్లు 48 గంటల పాటూ పట్టాలపైనే ఉండిపోయేలా రైల్‌రోకోలు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కావేరీ సమస్యపై కేంద్రంపై వత్తిడి తెచ్చేలా భారీఎత్తున ఆందోళనకు అందరూ సన్నద్ధం కావాలని ఆందోళనకు నాయకత్వం వహించిన డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ పిలుపునిచ్చారు.ఈ పిలుపు మేరకు అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీల నేతలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకోకు దిగారు.
చెన్నై పెరంబూరు రైల్వేస్టేషన్‌లో స్టాలిన్ నేతృత్వంలో రైల్‌రోకో పోరాటం సాగింది. పెరంబూరు తిరువళ్లూరు రోడ్డులోని రైల్వే క్రీడా మైదానం నుంచి 1500 మందితో కిలోమీటరు దూరంలోని రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కావేరీ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగి పెరంబూరు రైల్వేస్టేషన్‌ను ముట్టడించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. స్టాలిన్ సహా పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు వేలాది మంది కార్యకర్తలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని రైల్వేస్టేషన్‌లోకి చొరపడ్డారు. చెన్నైబీచ్-ఆవడి లోకల్‌రైలును కదలనీయకుండా పట్టాలపై కూర్చుండిపోయారు. దీంతో స్టాలిన్ సహా వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
చెన్నై తూర్పు జిల్లా డీఎంకే తరఫున టీ నగర్ బస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి మాంబళం రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు వెళుతుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సైదాపేట రైల్వేస్టేషన్ వద్ద సైతం డీఎంకే కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా, తమిళ మానిల కాంగ్రెస్ తరపున చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్ వద్ద, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వామపక్ష పార్టీల నేతలు జీ రామకృష్ణన్, త పాండియన్, ముత్తరసన్ సెంట్రల్ రైల్వేస్టేషన్ వద్ద, విరుదునగర్‌లో ఆర్ నల్లకన్ను, బేసిన్ బ్రిడ్జి వద్ద వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు రైల్‌రోకో నిర్వహించారు. తిరుచ్చిరాపల్లి కుడమురుట్టి వంతెనపై కొందరు ఆందోళనకారులు పశువులను అడ్డంగా నిలబట్టి, అలాగే రైలుపట్టాలపై పడుకుని నిరసన తెలిపారు.
అలాగే తంజావూరులో రైలు పట్టాలపై వంటావార్పు, వేలూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, నాగపట్టినం, తిరువారూరు, మధురై, కడలూరు, కోయంబత్తూరు, సేలం, కృష్ణగిరి, తిరునెల్వేలి, విళుపురం జిల్లాల్లో రైల్‌రోకో ఆందోళన భారీ ఎత్తున సాగింది. ఆయా జిల్లాల్లో ఆందోళనలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఇవే డిమాండ్లపై పుదుచ్చేరీలో సైతం రైల్‌రోకోలు నిర్వహించారు. రైల్‌రోకోలు పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు, రైతులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. రైల్‌రోకో పిలుపును అందుకున్న లక్షలాది మంది కార్యకర్తలు సోమవారం ఉదయం నుంచే రైల్వేస్టేషన్ల్‌కు రావడం ప్రారంభించగా భారీ సంఖ్యలో పోలీసులు బారికేడ్లను సిద్ధం చేసుకుని అడ్డుకున్నారు. రైల్‌రోకో కారణంగా అనేక చోట్ల రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
కావేఢీ
Published Tue, Oct 18 2016 2:33 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement