కావేరీ విధ్వంసం
కర్ణాటకలో తమిళుల ఆస్తుల విధ్వంసంపై ప్రతీకారేచ్చ రగిలింది. రాష్ట్రంలో పలుచోట్ల కర్ణాటక వాహనాలను ధ్వంసం చేశారు. చెన్నైలో కన్నడిగుల ప్రముఖ హోటల్‌పై పెట్రోబాంబులు విసిరేసి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్రంలోని కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రానికి కావేరి జలాలు విడుదలయ్యా యి. సెకనుకు 15వేల ఘనపుటడుగుల చొప్పున పదిరోజులపాటూ విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటకలోని ఆందోళనకారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. సుప్రీం తీర్పు వెలువడిన నాటి నుంచి ఆందోళనలు, విధ్వంసకర చర్యలను ఆరంభించిన ఆందోళనకారులు సోమవారం తమ మోతాదును మరింతగా పెంచారు. తమిళనాడుకు మరో 3 టీఎంసీలను ఈ నెల 20వ తేదీ వరకు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆందోళనకారులు రెచ్చిపోయి కర్ణాటకలోని తమిళనాడు వాహనాలను తగులబెట్టడం ప్రారంభించారు.
ప్రతీకార చర్య
కర్ణాటక ఆగడాలను వివిధ మాధ్యమాల ద్వారా రాష్ట్రానికి చేరడంతో తమిళ ప్రజలు రెచ్చిపోయారు. కర్ణాటకకు చెందిన వాహనాలు, ఇతర వ్యాపార సంస్థలపై దాడులను ప్రారంభించారు. చెన్నై రాయపేటలోని కర్ణాటకవాసులకు చెందిన న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున పెట్రో బాంబులు విసిరి విధ్వంసానికి పాల్పడ్డారు. తెల్లవారుజాము 3.30 గంటలకు 12 మందితో కూడిన దుండగుల బృందం ఇనుపరాడ్లను చేతబూని మోటార్‌సైకిళ్లపై చేరుకుంది. లోనికి ప్రవేశించిన వారు హోటల్‌పై మూడు పెట్రోబాంబులను విసరడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. హోటల్ ముందుభాగంలో కొత్త ఏర్పాటు చేసిన ఐస్‌క్రీం పార్లర్‌లోకి జొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. ఈలోగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ అక్కడికి చేరుకోగా అతన్ని రాడ్‌తో కొట్టి గాయపరిచి, పారిపోయారు. కర్ణాటకలోని తమిళులపై దాడులు చేస్తే ఇక్కడి కన్నడిగులపై దాడికి పాల్పడుతామని నినాదాలు చేస్తూ అదే అంశంతో కూడిన కరపత్రాలను జారవిడిచి పారిపోయారు.
హోటల్‌లోని సీసీ కెమెరాల ద్వారా వారంతా తందై పెరియార్ ద్రావిడ కళగానికి చెందిన వారిగా గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి చిదంబరానికి చేరుకున్న కర్ణాటక లారీని ఏడుగురు దుండగులు అనుసరించి పాక్షికంగా ధ్వంసం చేశారు. తాను తమిళనాడుకు చెందినవాడినని డ్రైవర్ శక్తి మొరపెట్టుకోవడంతో లారీని తగులబెట్టకుండా విడిచిపెట్టారు. శీర్కాళి వైదీశ్వరన్ కోవిల్ వద్ద నిలిచి ఉన్న కర్ణాటకకు చెందిన జీపు అద్దాలను పగులగొట్టారు. కర్ణాటకకు నుంచి రామేశ్వరానికి వచ్చిన రెండు వ్యాన్లపై దాడికి పాల్పడినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వేలూరు సమీపం రాణీ పేట నుంచి బెంగళూరుకు వెళుత్ను లారీని ధ్వంసం చేయగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు-వేలూరు కర్ణాటక బస్సును అంబూరు వద్ద అడ్డగించిన వీసీకేకు చెందిన 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామేశ్వరంలో సోమవారం తెల్లవారుజామున కర్ణాటకకు చెందిన రెండు టెంపోవ్యాన్లను ధ్వంసం చేశారు. ఈ కేసులో దేశీయ మున్నని పార్టీకి చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. తమిళనాడువాసులపై దాడులు కొనసాగిన పక్షంలో కర్ణాటక ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తామని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం హెచ్చరించింది.
పుదుచ్చేరిలోని కర్ణాటక బ్యాంకును వివిధ సంఘాలకు చెందిన వారు సోమవారం ముట్టడించారు. తమిళనాడుకు చెందిన సంపత్ (21) బెంగళూరులో బీఎస్సీ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఫేస్‌బుక్‌లో కావేరి వివాదంపై తన స్పందన తెలియజేశారు. దీంతో బెంగళూరులో అతనిని చుట్టుముట్టిన ఆందోళనకారులు రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పుదుచ్చేరివాసులు ఇక్కడి కర్ణాటక బ్యాంకును ముట్టడించి సీఎం సిద్ధరామయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్ణాటక ఆందోళనకారులను దుయ్యబడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 35 మందిని పుదుచ్చేరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ ఖండించారు.
సీఎం అత్యవసర సమావేశం
కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న దృష్ట్యా ముఖ్యమంత్రి జయలలిత సోమవారం డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర కమిషనర్ జార్జ్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తమిళనాడులోని కర్ణాటక కార్యాలయాలు, వాహనాలు ఇతర సంస్థలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్, నటుడు ప్రభుదేవా ఇళ్లకు బందోబస్తు ఏర్పాటు చేశారు.