కుల, మత బేధాలకు అతీతంగా, తిథి, నక్షత్రం, మంచి ముహూర్తం, మంత్రోచ్ఛారణలు లేకుండా స్వయం మర్యాద పూర్వక వివాహం కరుణ ఇంట మిన్నంటింది. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మనవడు, నటుడు అరుల్ నిధి వివాహానికి రాజకీయ పక్షాలు, సినీ తారలు తరలువచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తమ శుభాకాంక్షల్ని తెలియజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ కరుణానిధి కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, చెన్నై:డీఎంకే అధినేత ఎం కరుణానిధి కుమారుడు ముక్కా తమిళరసు తనయుడు అరుల్ నిధి సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరుల్ నిధి వివాహాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి కన్నదాసన్ కుమార్తె కీర్తనతో జరిపేందుకు నిశ్చయించారు. ఈ వివాహంతో రాజకీయ నాగరికతను చాటుకునే విధంగా అన్ని పార్టీల నాయకుల ఆహ్వానం పలికారు. స్వయంగా పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ అందరి నేతల ఇళ్ల మెట్లు ఎక్కారు.
కల్యాణ..కమనీయం
డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అన్నా అరివాలయంలో సోమవారం ఈ వివాహం జరిగింది. డీఎంకే అధినేత కరుణానిధి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ నేతృత్వం లో జరిగిన ఈ వివాహ వేడుకకు డీఎంకే కుటుంబం తరలి వచ్చింది. పార్టీ బహిష్కరణతో కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్న పెద్ద కుమారుడు ఎంకే అళగిరి ఈ వివాహ వేడుకకు తన సతీమణి గాంధీ అళగిరితో కలిసి హాజరయ్యారు. తల్లి రాజాత్తి అమ్మాల్‌తో కలసి ఎంపీ కనిమొళి వివాహానికి వచ్చారు. అందర్నీ స్టాలిన్, ముక్కా తమిళరసులు సాదరంగా ఆహ్వానించారు. వివాహ వేదికపై కరుణానిధి, అన్భళగన్‌తో కలసి ఎండీఎంకే నేత వైగో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌లు ఆశీనులయ్యారు.
తరలి వచ్చిన నేతలు
కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత నల్లకన్ను, పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి, వీసీకే నేత తిరుమావళవన్, ఎంజీఆర్‌కళగం నేత ఆర్‌ఎం వీరప్పన్, పెరుందలైవర్ కట్చి నేత ఎన్‌ఆర్ ధనపాలన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, దేశీయ లీగ్ నేత తిరుప్పూర్ అల్తాఫ్, కాంగ్రెస్ నేతలు డీఎంకే మాజీ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు, నటుడు విజయ్, ఎస్వీ శేఖర్, పలువురు నటీమణులు, తదితరులు వచ్చారు.
ఆశీస్సులు
వరుడు అరుల్ నిధి, వధువు కీర్తనను ఆశీర్వదిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్ ద్వారా, సందేశాల ద్వారా తమ ఆశీస్సుల్ని, శుభాకాంక్షల్ని అందించారు. ఆదివారం రాత్రి జరిగిన రిసెప్షన్‌లో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత ఇలగణేషన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణి, పీఎంకే నేత రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి రాందాసు ,నాయకులు జీకే మణి, ఏకే మూర్తి, తమిళ మానిల కాంగ్రెస్ నేతలు జీకే వాసన్, జ్ఞాన దేశికన్, కాంగ్రెస్ నేతలు తిరునావుక్కరసు, వసంతకుమార్, నారాయణ స్వామి, వైద్యలింగం, తంగబాలు, కృష్ణ స్వామి, కుమరి ఆనందన్, డీఎండీకే అధినేత విజయకాంత్ బావమరిది, యువజన నేత సుదీష్‌లు, ఎంఎంకే అధ్యక్షుడు జవహరుల్లా తరలి వచ్చిన తమ ఆశీస్సులు అందించారు.
రజనీ రాక
సూపర్‌స్టార్ రజనీ కాంత్ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గీత రచయిత వైరముత్తు, నటుడు శివకుమార్, కార్తీ, ప్రభు కుటుంబం, నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు, ఆమె భర్త సుందర్ సీ, నటుడు విశాల్ కుటుంబం, విజయకుమార్ కుటుంబం, సత్యరాజ్, పార్తీబన్, దర్శకుడు భారతీ రాజ, కేఎస్ రవికుమార్, తదితర సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
అనారోగ్యంతో...
ఈ వివాహ వేడుకలో వధూవరుల్ని ఆశీర్వదిస్తూ, కరుణాని ధి ప్రసంగించారు. తనకు అనారోగ్యంగా ఉందని, ఇది వయోభారంతో వచ్చింది మాత్రం కాదన్నారు. శ్రమ పెరగడం, విశ్రాంతి కరువు కావడంతో ఈ పరిస్థితిగా పేర్కొన్నారు. తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
విచ్చిన్నం ఎవరి తరం కాదు
ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ ఈ వివాహ వేడుకను చూస్తుంటే 44 ఏళ్ల క్రితం జరిగిన ఘటన గుర్తుకు వస్తోందన్నారు. తన వివాహానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొనడంతో, చివరకు కళింగపట్నంలోని తన ఇంటికి వచ్చి మరీ ఆశీర్వదించి, విశ్రాంతి తీసుకున్న సమయంలో అన్నయ్య(కరుణానిధి) చెప్పిన కొన్ని వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయని వివరించారు. త్యాగాలకు ప్రతీక ద్రవిడ ఇయక్కం అని వ్యాఖ్యానించారు. ఈ ద్రవిడ ఇయక్కంను విచ్చిన్నం చేయడం ఎవరి తరం కాదన్న విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేస్తున్నాని పేర్కొన్నారు.
కల్యాణ వైభోగమే..
Published Tue, Jun 9 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement