బెదిరింపులతో భూములు లాక్కుంటారా..?
బెదిరింపులతో భూములు లాక్కుంటారా..?
Published Sat, Oct 15 2016 4:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
అంగీకారం లేకుండా ప్రాజెక్టులను నిర్మించడం దుర్మార్గం
డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తారా?
ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా?
2013 చట్టం ద్వారానే భూసేకరణ జరపాలి
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో మల్లన్నసాగర్ ముంపు బాధితుల దీక్షలకు సంఘీభావం
తొగుట: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపువాసులు చేపడుతున్న రిలే దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. గ్రామాల మధ్య 50 టీఎంసీల రిజర్వాయర్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిటెయిల్డ్ రిపోర్టు తయారు చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముం దుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల అం గీకారం లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం దుర్మార్గమని మండిపడ్డారు. 123 జీఓతో భూసేకరణ చేయడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ప్రజలు కోరినా ప్రభుత్వం ముందుకు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంతో ప్రజలకు ఏ విధంగా నష్టమో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం మాట వినని ప్రజలపై 144 సెక్షన్ విధించి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు.
రెవెన్యూ అధికారులు పోలీసులతో బెదిరింపులకు గురి చేసి భూములు లక్కోవడం దుర్మార్గమన్నారు. భూములన్నీ గుంజుకుని బహుళజాతి సంస్థలకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్టంలో నిరుపేదలకు అన్ని విధాలా హక్కులున్నాయని చెప్పారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను రోడ్డుపాలు చేయడానికేనా? అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రా జెక్టులు, పరిశ్రమల పేరిట భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీ జేఏసీ కోకన్వీనర్ పిట్టల రవీందర్, నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు రమేశ్, విద్యా సంస్థల ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement