ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా
⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
⇒ అమరావతి దేవేంద్రుడి రాజధాని.. ఇక్కడ గొడవలు చేయొద్దు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, అయినా దానికోసం ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... తాను రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తుండగా, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకొని ఆందోళనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
నంబర్‌వన్ కార్మికుడిగా పనిచేస్తున్నా...: శాసనసభలో ఎమ్మెల్యేలు కుర్చీలు ఎక్కి కోతుల్లా ఎగరడం చూసి బాధ కలిగిందని చంద్రబాబు అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మైకులు విరగ్గొట్టారని, ఈసారి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో విరగకుండా ఉండే మైకులు, మైక్రోఫోన్లు ఏర్పాటు చేశామన్నారు. తనకు కుటుంబం కన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మిన్న అని తెలిపారు. రాష్ట్రం కోసం తాను నంబర్ వన్ కార్మికుడిగా పని చేస్తున్నానన్నారు. అమరావతి దేవేంద్రుడి రాజధాని అని, ఈ ప్రాంతంలో ఎవరూ గొడవలు, నేరాలు చేయడానికి వీల్లేదన్నారు.
ఉద్యోగులకు ఇళ్ల స్థలాలివ్వలేం : రాజధానిలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసింది. భూమి తక్కువగా ఉందనే సాకు చెప్పింది. సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి గాను సీఆర్‌డీఏ నిర్ణయించిన ధరకు స్థలాలు ఇస్తామని తెలిపింది. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులతో సీఎం ఈ అంశంపై చర్చించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే 9,031 మంది అధికారులు, ఉద్యోగుల కోసం వారి సొమ్ముతోనే జీ+8 అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.